సైబర్‌ క్రిమినల్‌... ట్రిపుల్‌ యాక్షన్‌!

21 Jun, 2022 08:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. నగరానికి చెందిన ఓ మహిళను మోసం చేయడానికి ఉత్తరాదికి చెందిన ఓ సైబర్‌ క్రిమినల్‌ ట్రిపుల్‌ యాక్షన్‌ చేశాడు. బాధితురాలి నుంచి ఇప్పటికే రూ.3 లక్షలు కాజేసిన అతగాడు మరో రూ.13 లక్షల కోసం బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె సోమవారం సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది.

  • బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ మానసిక నిపుణురాలు. వివాహిత అయినప్పటికీ కొన్నాళ్ల క్రితం అనివార్య కారణాలతో భర్తకు దూరంగా ఉంటోంది. ఈమెకు ఫేస్‌బుక్‌ ద్వారా సుమిత్‌ సిరోహి అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ పేరుతో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసింది రాజస్థాన్‌కు చెందిన సైబర్‌ నేరగాడిగా తెలుస్తోంది. 
  • నగర మహిళ, సుమిత్‌ కొన్నాళ్లు ఫేస్‌బుక్‌ ద్వారా చాటింగ్‌ చేసుకున్నారు. ఆపై ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని వాట్సాప్‌లోనూ సంప్రదింపులు జరిపారు. తాను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) ఎస్సైగా సుమిత్‌ పరిచయం చేసుకున్నాడు. 
  • ఒకటి–రెండుసార్లు బాధితురాలితో వీడియో కాల్స్‌ ద్వారా మాట్లాడాడు. ఆ సందర్భాల్లో యూనిఫాంలో ఉండి, వెనుక పోలీసులు కనిపించే చేసి ఈమెను పూర్తిగా నమ్మించాడు. అలా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి పదోన్నతి వచ్చాక చేసుకుందామని ఎర వేశాడు. 
  • ఇది జరిగిన కొన్ని రోజులకు ఫేస్‌బుక్‌ ద్వారానే బాధితురాలికి రవి కపూర్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ పేరుతో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి, బాధితురాలిని పరిచయం చేసుకున్నదీ సుమిత్‌గా చెప్పుకున్న సైబర్‌ నేరగాడే. ఈమెతో చాటింగ్‌ చేసిన ఇతగాడు ముంబైలో నివసించే తాను ఓ బాలీవుడ్‌ ప్రముఖుడినని చెప్పాడు.  
  • దీంతో సుమిత్‌కు పదోన్నతి కల్పించాలని ఆమె రవిని కోరింది. అందుకు అంగీకరించిన అతడు సుమిత్‌ను తనకు పరిచయం చేయమని చెప్పాడు. దీంతో ఇతడి నెంబర్‌ సుమిత్‌కు ఇచ్చిన మహిళ ఆయనతో మాట్లాడమని చెప్పింది. ఆ తర్వాత ఈమెకు కాల్‌ చేసిన రవి పదోన్నతి ఇప్పించడానికి రూ.20 లక్షలు ఖర్చవుతాయని చెప్పాడు. ఇతడు మాత్రం వీడియో కాల్స్‌ చేయలేదు.  
  • ఇదే విషయం సుమిత్‌కు చెప్పిన బాధితురాలు వీలైనంత ఏర్పాటు చేయమంది. అయితే తన వద్ద కేవలం రూ.13 లక్షలు ఉన్నాయని, ఆ మొత్తం నీకు పంపిస్తానని చెప్పాడు. మిగిలింది కలిపి రవికి పంపాలని, మనం తర్వాత చూసుకుందామని నమ్మించాడు. ఏ దశలోనూ రవి పేరుతోనూ మాట్లాడుతున్నది తానే అని ఈమెకు తెలియనీయలేదు.  
  • వివిధ దఫాల్లో రూ.13 లక్షల్ని గూగుల్‌ పే ద్వారా నగర మహిళకు పంపిన సుమిత్‌ దానికి మరికొంత జోడించి రవికి పంపాలన్నాడు. ఇది నమ్మిన బాధితురాలు తన బంగారం కుదువపెట్టి రూ.3 లక్షలు జోడించింది. ఈ రూ.16 లక్షల్ని రవి అనే వ్యక్తి చెప్పిన ఖాతాకు పంపింది. ఇలా రెండు పాత్రల్ని పోషించిన సైబర్‌ నేరగాడు డబ్బు చేతికి అందాక మూడో అవతారం ఎత్తాడు. 
  • రవి కపూర్‌ కార్యాలయంలో పని చేసే ఉద్యోగిగా బాధితురాలికి పరిచయమయ్యాడు. పదోన్నతికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని రోజులు చెప్పాడు. ఆపై హఠాత్తుగా ఫోన్‌ చేసి రవి కపూర్‌ హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయాడన్నాడు. ఆపై అతడి ఫోన్‌ పని చేయలేదు. ఈ విషయాన్ని బాధితురాలు సుమిత్‌కు చెప్పింది. 
  • ఇలాంటి సందర్భం కోసమే ఇంత కథ నడిపిన సైబర్‌ నేరగాడు అప్పుడు అసలు ఘట్టం మొదలెట్టాడు. తనకు రవి ఎవరో తెలియదని, నీవే పరిచయం చేశావంటూ ఆరోపించాడు. రూ.13 లక్షలు సైతం నేను నీకే పంపానని, ఆ మొత్తం నువ్వే తిరిగి ఇవ్వాలని బెదిరించాడు. అలా చేయకుంటే ఇంటికి వచ్చి గొడవ చేయడంతో పాటు కేసు పెడతానంటూ భయపెట్టాడు. 
  • దీంతో బాధితురాలు సోమవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ మూడు పాత్రలు పోషించింది ఒకే సైబర్‌ నేరగాడని, అతడి ముఠా సభ్యలు సహకరించారని తేల్చారు. వీరిని పట్టుకోవడానికి సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు.  

(చదవండి: చుక్కలు చూపించింది! పెళ్లి చేసుకున్న నెలకే గెంటేసి....)

మరిన్ని వార్తలు