ఇన్‌స్టాల్‌ చేసే యాప్‌తోపాటే ‘రాట్‌’ వైరస్‌..  ఫోన్‌  మీ దగ్గరే ఉంటుంది.. కానీ, కంట్రోల్‌ చేసేది?

29 May, 2023 18:19 IST|Sakshi

అనాలోచితంగా డౌన్‌లోడ్‌ చేస్తే ఇబ్బందులే.. 

ఆకర్షణీయంగా తయారు చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు 

ఓటీపీలు సైతం తస్కరించేందుకు అవకాశం 

అందినకాడికి దండుకుంటున్న సైబర్‌ క్రిమినల్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌ :  ఆకర్షణీయ సౌకర్యాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించినవి అంటూ అనేక యాప్స్‌కు సంబంధించిన యాడ్స్‌ ఇంటర్‌నెట్, సోషల్‌మీడియాల్లో రాజ్యమేలుతున్నాయి. వీటితో అవస రం ఉన్నా లేకపోయినా ఉచితం కదా అని అనేక మంది తమ స్మార్ట్‌ఫోన్స్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు.

దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ–నేరగాళ్లు ప్రయోగిస్తున్న ఆయుధం ‘రాట్‌’గా పిలిచే రిమోట్‌ యాక్సెస్‌ ట్రోజన్‌. యాప్స్‌ మాటున నేరగాళ్లు ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను చొప్పించడం ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి సెల్‌ఫోన్‌ను తమ అదీనంలోకి తీసుకుని చేయాల్సిన నష్టం చేసేస్తున్నారు.  

అడుగడుగునా యాప్స్‌ వినియోగమే... 
♦ స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో... వివిధ రకాలైన యాప్స్‌ వాడకం అంతకంటే ఎక్కువైంది. నిద్ర లేవడం నుంచి ఆహారం తీసుకోవడం, ఉష్టోగ్రతలు తెలుసుకోవడం, వినోదం ఇలా... ఒక్కో ఫోన్‌లో కనీసం 10–15 యాప్స్‌ ఉంటున్నాయి. వినియోగదారుడి ‘యాప్‌ మేనియా’ను క్యాష్‌ చేసుకునేందుకు సైబర్‌ క్రిమినల్స్‌ కొత్త ఎత్తులు వేస్తున్నారు. వీరు తొలుత దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్‌ నంబర్ల డేటాను వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. ఇలా నంబర్లు తమ చేతికొచ్చాక అసలు కథ మొదలవుతుంది. 

సందేశాలతో ప్రారంభమయ్యే ప్రక్రియతో..
♦  తాము ఉచితంగా ఇస్తున్న ఫలానా యాప్‌లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ ఎస్సెమ్మెస్, వాట్సాప్‌ లేదా సోషల్‌మీడియాల్లో యాడ్స్‌ పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు అందులో ఉన్న లింక్‌ను క్లిక్‌ చేస్తే సదరు యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది.

వినియోగదారుడికి తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా దీంతోపాటే సదరు క్రిమినల్‌ పంపిచే ట్రోజన్‌ కూడా అదే మొబైల్‌ ఫోన్‌లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి ఫోన్‌ మన దగ్గర ఉన్నప్పటికీ.. అది సైబర్‌ క్రిమినల్‌ ఆదీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న సెల్‌ఫోన్‌ను యాక్సెస్‌ చేస్తూ అవసరమైన విధంగా వాడగలుగుతాడు. అందుకే ఈ వైరస్‌ను రిమోట్‌ యాక్సెస్‌ ట్రోజన్‌ (రాట్‌) అంటారు.

నేరగాడి అధీనంలోకి వెళ్తే ఖాతా ఖాళీ
 ♦ మన ఫోన్‌ సైబర్‌ నేరగాడి ఆదీనంలోకి వెళ్లిపోయాక మనం ఫోన్‌లో చేసే ప్రతి చర్యనూ అతడు పర్యవేక్షించగలడు. కాల్స్, ఎస్సెమ్మెస్‌లతోపాటు సెల్‌ఫోన్‌లో ఉన్న సమాచారం, దాని కెమెరాలను సైతం సైబర్‌ నేరగాడు తన ఆదీనంలోకి తీసుకోగలడు. ఇటీవల సినిమా టికెట్లు మొదలుకుని కొన్ని రకాలైన బిల్లుల చెల్లింపు వరకు అన్నీ అత్యధిక శాతం సెల్‌ఫోన్‌ ద్వారా జరుగుతోంది.

వీటి కోసం కోసం మొబైల్‌ వినియోగదారులు నెట్‌ బ్యాంకింగ్‌ వాడటం లేదా తమ డెబిట్‌/క్రెడిట్‌ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతోపాటు లావాదేవీలకు సంబంధించి బ్యాంకు పంపే వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్స్‌ సైతం సెల్‌ఫోన్‌కే వస్తుంటాయి. ఎవరైనా క్రెడిట్‌/డెబిట్‌ కార్డు వివరాలు, నెట్‌బ్యాంకింగ్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్స్‌లను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా... ఓటీపీ నమోదు చేయనిదే లావాదేవీ పూర్తికాదు. 

వినియోగదారుడి ప్రమేయం లేకుండానే.. 
♦ ఈ ఓటీపీని సంగ్రహించడానికీ సైబర్‌ నేరగాళ్లు ముందు పంపే యాప్‌లోని రాట్‌ ద్వారానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్‌ నుంచే సంగ్రహిస్తున్నారు. కార్డుల వివరాలు అప్పటికే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఓటీపీ నమోదుచేసి అందినకాడికి స్వాహా చేస్తున్నారు.

ఓటీపీ అవసరమైన లావాదేవీలను సైబర్‌ క్రిమినల్స్‌ అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో వినియోగదారులు నిద్రలో ఉంటారని, అతడి ప్రమేయం లేకుండానే వచ్చిన ఓటీపీని గుర్తించరని అంటున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా బోగస్‌ వివరాలతో తెరిచిన ఖాతాలనో, బోగస్‌ చిరునామాలను పెట్టడమో చేస్తుంటారని వివరిస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా నేరగాళ్లను పట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు/వ్యక్తులు రూపొందించే యాప్స్‌కు దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.  

మరిన్ని వార్తలు