ఫోన్‌కు వచ్చిన లింక్ క్లిక్ చేసిన బ్యాంక్ మేనేజర్.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!

25 Feb, 2023 08:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వరంగల్‌: ఖాతాదారులకు జాగ్రత్తలు చెప్పాల్సిన ఓ సీనియర్‌ బ్యాంక్‌ అధికారే సైబర్‌ నేరగాళ్లు చెప్పినట్లు చేసి మోసపోయారు. తన ఖాతా నుంచి రూ.2,24,967 పోగొట్టుకున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..

పరకాల ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ సకల్‌ దేవ్‌సింగ్‌ ఫోన్‌కు ఈ నెల 23న రాత్రి ఓ వ్యక్తి (89878 61993) నుంచి ‘ఎస్‌బీఐ అకౌంట్‌ డీయాక్టివేటెడ్‌..ప్లీజ్‌ క్లిక్‌ అన్‌ద లింక్‌ అండ్‌ అప్డేట్‌ పాన్‌కార్డు నంబర్‌ ఇమీడియట్లీ’అనే మెసేజ్‌ వచ్చింది. తెల్లవారుజామున దాన్ని చూసుకున్న దేవ్‌సింగ్‌ ఆ మెసేజ్‌పై రెండుసార్లు క్లిక్‌ చేశారు. రెండుసార్లు క్లిక్‌ చేయడంతో ఎస్‌బీఐ ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ ఓపెన్‌ అయింది. పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయమనడంతో చేశారు.

ఆ తర్వాత మరో కొత్త నంబర్‌ 74318 29447 నుంచి ఫోన్‌ వచ్చింది. తాము పంపిన మెసేజ్‌పై క్లిక్‌ చేసి నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలని, పాన్‌కార్డు అప్డేట్‌ చేయమని అతను చెప్పడంతో.. తాను బస్‌లో ఉండడం వల్ల సాధ్యం కావడం లేదని, బ్యాంక్‌కు వెళ్లి ప్రయత్నిస్తానని దేవ్‌సింగ్‌ సమాధానం ఇచ్చారు. దీంతో వాట్సాప్‌కు మరో కొత్త నంబర్‌ 79087 54873 నుంచి మెస్సెజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌ లింక్‌పై ఆయన రెండు సార్లు క్లిక్‌ చేశారు.

దీంతో క్షణాల్లో బ్యాంక్‌ అధికారి ఖాతాలో ఉన్న నగదు అంతా మాయమైంది. మొదటిసారి రూ.99,990, రెండోసారి రూ.99,990, మూడోసారి రూ.24,987 డెబిట్‌ అయ్యాయి. మొత్తం రూ.2,24,967 ఖాతా నుంచి పోగొట్టుకున్న దేవ్‌సింగ్‌ మోసాన్ని గ్రహించి పరకాల పోలీసులను ఆశ్రయించారు.
చదవండి: కేవలం లైకులు కొడితే డబ్బులు ఇస్తామని గాలం.. మూడు రోజుల్లో రూ.1.22 కోట్లు స్వాహా..!

మరిన్ని వార్తలు