కోట్లు వచ్చేలా చేస్తాం.. రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా!

29 Oct, 2022 09:47 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: షేర్‌ మార్కెట్‌పై నగర వాసికి ఉన్న మక్కువను క్యాష్‌ చేసుకున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఆయన అకౌంట్‌ను హ్యాక్‌ చేసి తెలియకుండా అతి తక్కువ ధరకు షేర్స్‌ను అమ్మేశారు. మళ్లీ షేర్‌ హోల్డర్‌తోనే ఎక్కువ రేట్‌కు షేర్స్‌ను కొనుగోలు చేపించి రూ.లక్షలు నష్టపోయేలా చేయడంతో.. బాధితుడు శుక్రవారం సిటీసైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళితే.. నల్లకుంటకు చెందిన హరీష్‌చంద్రారెడ్డి కొంతకాలంగా షేర్‌ మార్కెట్‌ బిజినెస్‌ చేస్తున్నాడు. షేర్స్‌ను కొనుగోలు చేసి ఎల్‌ఐఎస్‌బ్లూ ఫైనాన్షియల్‌ త్రూ అమ్మడం, కొనడం చేస్తుంటాడు. ఈ క్రమంలో పరిచయం అయిన సైబర్‌ కేటుగాళ్లు హరీష్‌చంద్రారెడ్డి అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. రూ.700 విలువ గల షేర్స్‌ను కేవలం రూ.100కు ఇతరులకు అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న హరీష్‌చంద్రారెడ్డి వెబ్‌సైట్‌లో ఉన్న వారిని ప్రశ్నించగా.. కోట్లు వచ్చేలా చేస్తామని నమ్మించారు. లాభాలు లేని వాటిని రూ.700–800 చొప్పున కొనుగోలు చేయించారు. ఇలా పలు దఫాలుగా కేవలం రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా చేశారు. మోసపోయినట్లు గుర్తించిన హరీష్‌చంద్రారెడ్డి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.  

మీ డబ్బంతా ఏజెంట్‌ తినేశాడంటూ.. వృద్ధుడికి రూ.25లక్షలు టొకరా 
ఇన్సురెన్స్‌ ఎక్స్‌పైరీ అయినా సరే..సైబర్‌ కేటుగాళ్లు మాత్రం అమాయకుల్ని వదలట్లేదు. మీకు రావాల్సిన దానికంటే తక్కువ డబ్బును పొందారు. మీకేం బాధ అనిపించడం లేదా అంటూ సింపతితో లక్షలు కాజేశారు. కుల్సుంపురాకు చెందిన వృద్ధుడు రెండు సంస్థల్లో ఇన్సురెన్స్‌ చేశాడు. అది చాలా కాలం క్రితం ఎక్స్‌పైరీ కూడా అయ్యింది.

తాజాగా రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కాల్‌ చేసి ఆధార్, పాన్, బ్యాంక్‌ డిటైల్స్‌ తీసుకున్నాడు. కొంత డబ్బు కట్టాలనడంతో వృద్ధుడు చెల్లించాడు. రూ.3 లక్షలు వస్తాయని నమ్మించి పలు దఫాలుగా అతడి నుంచి రూ.25లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీసైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: దేవుడా క్షమించు నీ హుండీ ఎత్తుకెళ్తున్నా!.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు