గిఫ్ట్‌ ఓచర్‌ పేరిట గాలం

12 Aug, 2020 08:07 IST|Sakshi

నగర మహిళకు సైబర్‌ నేరగాళ్ల టోకర

మొదట రూ. 4 వేలు కాజేశారు

డబ్బు తిరిగి ఇవ్వాలని ఫోన్‌ చేసిన బాధితురాలు   

ఇస్తానంటూ క్విక్‌ సపోర్ట్‌ డౌన్‌లోడ్‌ చేయించిన వైనం 

దీన్ని వినియోగించి మరో రూ.2.35 లక్షలు స్వాహా 

సాక్షి, సిటీబ్యూరో: కంటికి కనిపించకుండా అందినకాడికి దండుకునే సైబర్‌ నేరగాళ్లు అప్పుడప్పుడు ‘డబుల్‌ ధమాకా’ ఇస్తున్నారు. ఇలాంటి షాకే బేగంపేటకు చెందిన మహిళకు తగలడంతో ఆమె మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈమెతో పాటు మరో ముగ్గురు బాధితుల ఫిర్యాదు మేరకు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.   బేగంపేటలో నివసించే ఓ మహిళకు ఇటీవల సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. తమ సంస్థలో పలుమార్లు షాపింగ్‌ చేసినందుకు గిఫ్ట్‌ ఓచర్‌ గెల్చుకున్నారని చెప్పారు. రూ.4 వేలు విలువైన దాన్ని ఆన్‌లైన్‌లో ఫోన్‌ పే ద్వారా చెల్లించేస్తామని ఎర వేశారు. ఆమె అంగీకరించడంతో ప్రొసీడ్‌ టు పే రిక్వెస్ట్‌ పంపారు. దీనిపై అవగాహన లేని బాధితురాలు యాక్సప్ట్‌ చేయడంతో ఆమె ఖాతాలోకి డబ్బు రావాల్సిందిపోయి...అందులో ఉన్న రూ.4 వేలు సైబర్‌ నేరగాళ్లకు చేరిపోయాయి.

ఆ తర్వాత సదరు క్రిమినల్స్‌ స్పందించడం మానేశారు. అయితే పదేపదే వారికి కాల్‌ చేసిన బాధితురాలు ఎట్టకేలకు మాట్లాడగలిగారు. ఈ నేపథ్యంలోనే తనకు గిఫ్ట్‌ ఓచర్‌ వచ్చిందని చెప్పి తన డబ్బు ఎలా కాజేస్తారంటూ ప్రశ్నిస్తూ వారితో ఘర్షణకు దిగారు. దీంతో సైబర్‌ నేరగాళ్లు ఆమె నుంచి భారీ మొత్తం కాజేయడానికి మరో పథకం వేశారు. జరిగిన పోరపాటుకు చింతిస్తున్నామని, ఆ డబ్బు గూగుల్‌ పే ద్వారా తిరిగి ఇవ్వలేమని చెప్పారు. ఆ మొత్తం పొందాలంటే ఫోన్‌లో క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. నిజమేనని నమ్మిన ఆమె అలా చేయడంతో దాని యాక్సస్‌ను సైబర్‌ నేరగాళ్లు తీసుకున్నారు. దీని ద్వారా బాధితురాలికి చెందిన నెట్‌బ్యాంకింగ్, డెబిట్‌కార్డు వివరాలను వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్స్‌తో సహా సంగ్రహించి వాటిని వినియోగించి ఆమె ఖాతా నుంచి మరో రూ.2.35 లక్షలు కాజేశారు. దీంతో ఆమె మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.   

దక్షిణ మధ్య రైల్వేలో లోకోపైలెట్‌గా పని చేసే ఓ వ్యక్తి రామాంతపూర్‌లో నివసిస్తున్నాడు. ఈయన ఇటీవల గూగుల్‌ పే ద్వారా తన స్నేహితుడికి రూ.3 వేలు బదిలీ చేశారు. ఆ మొత్తం ఎదుటి వారికి చేరకపోవడంతో ఆ సంస్థను సంప్రదించాలని నిర్ణయించుకున్నాడు. గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేయగా అతడికి ఓ నంబర్‌ కనిపించింది.  అది నిజమైనదే అని నమ్మి అతడు కాల్‌ చేయగా... అవతలి వ్యక్తులు గూగుల్‌పే ప్రతినిధుల మాదిరిగానే మాట్లాడారు. విషయం తెలుసుకున్న తర్వాత ఆ డబ్బు తిరిగి పొందడానికంటూ క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు. దీని ద్వారా అతడి నెట్‌ బ్యాంకింగ్‌ ఖాతా నుంచి రూ.80 వేలు కాజేశాడు.  

మలక్‌పేటకు చెందిన మరో వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. పేటీఎం సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ అవతలి వ్యక్తులు పరిచయం చేసుకున్నారు. మీ ఖాతాకు సంబంధించిన కేవైసీ వివరాలను తక్షణం అప్‌డేట్‌ చేసుకోవాలని, లేదంటే బ్లాక్‌ అవుతుందని భయపెట్టారు. దీనికోసమంటూ క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు. దీని ఆధారంగా రూ.51 వేలు స్వాహా చేశారు. 

ఎస్సార్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి సెకండ్‌ హ్యాండ్‌ ద్విచక్ర వాహనం ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసిన ఆయన ఫేస్‌బుక్‌ మార్కెట్‌ ప్లేస్‌లో ఉన్న ప్రకటన చూసి అందులో ఉన్న నంబర్‌కు కాల్‌ చేశారు. ఈ కాల్‌ అందుకున్న సైబర్‌ నేరగాళ్లు ఇతడిని నమ్మించి అడ్వాన్సులు, రవాణా చార్జీల పేరుతో రూ.57 వేలు బదిలీ చేయించుకుని మోసం చేశారు. 

మరిన్ని వార్తలు