క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.కోటి ఖాళీ

11 Mar, 2022 08:42 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే రూ.కోట్లు సంపాదించవచ్చునని ఎరవేసిన సైబర్‌ నేరగాళ్లు  ఐదుగురి వ్యక్తుల నుంచి సుమారు రూ.కోటికి పైగా కొట్టేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కవాడిగూడకు చెందిన శ్రీనివాస్‌ను ఇటీవల ఓ వ్యక్తి టెలిగ్రామ్‌ గ్రూప్‌లో యాడ్‌ చేశాడు. సదరు గ్రూప్‌లో నిత్యం క్రిప్టో కరెన్సీపైనే చర్చ జరుగుతుండేది.

కొద్దిరోజుల తర్వాత శ్రీనివాస్‌తో మాటలు కలిపిన సైబర్‌ నేరగాడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. ‘కేకాయిన్‌’ అనే యాప్‌ను శ్రీనివాస్‌ మొబైల్లో డౌన్‌లోడ్‌ చేయించి పెట్టుబడి పెట్టించాడు. పలు దఫాలుగా రూ.73లక్షలు పెట్టుబడి పెట్టాడు. రూ.73లక్షలకు గాను అతడి సైట్‌లో ఇతని పేరుపై రూ.4కోట్లు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని మార్చుకునేందుకు, డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో శ్రీనివాస్‌ అతడిని నిలదీశాడు.

మరింత పెట్టుబడి పెడితే ఒకేసారి రూ.కోట్లు తీసుకోవచ్చని చెప్పాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  అంబర్‌పేటకు చెందిన రాజు ఇతని స్నేహితులు మరో ముగ్గురు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. రాజుకు తెలిసిన వ్యక్తి సహకారంతో రూ.28లక్షలు పెట్టుబడి పెట్టారు. లాభాలు చూపించకపోగా ఇచ్చిన సొమ్మును వెనక్కి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. 

(చదవండి: పెళ్లి పేరుతో వంచన...పరారైన ప్రియుడు)

మరిన్ని వార్తలు