ఎస్‌ఐ పేరుతో ‘సైబర్‌’ వల

17 Sep, 2020 08:52 IST|Sakshi

నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీ క్రియేట్‌ 

అప్రమత్తమైన గుంతకల్లు టూటౌన్‌ ఎస్‌ఐ 

 తప్పుడు మెసేజ్‌లతో మోసపోవద్దని హెచ్చరిక   

గుంతకల్లు: సైబర్‌ నేరగాళ్లు ఏకంగా పోలీసుశాఖలోని సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పేరుతోనే నకిలీ ఫేస్‌బుక్‌ క్రియేట్‌ చేసి.. తాను కష్టాల్లో ఉన్నాను ఆర్థికసాయం చేయాలని కోరి డబ్బు కాజేయడానికి ప్రయత్నించిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. ఎట్టకేలకు ఎస్‌ఐ అప్రమత్తం కావడంతో నకిలీ వ్యవహారం బట్టబయలైంది. తప్పుడు మెసేజ్‌లతో టోకరా వేసే సైబర్‌నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాధిత గుంతకల్లు టూటౌన్‌ ఎస్‌ఐ సురేష్‌బాబు హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే... కొందరు సైబర్‌ నేరగాళ్లు ఎస్‌ఐ సురేష్‌బాబు ఒరిజినల్‌ ఐడీలోని పర్సనల్‌ ఫొటోలను తస్కరించి ‘సురేష్‌ ఎస్‌ఐ’ పేరిట ఫేస్‌బుక్‌ క్రియేట్‌ చేశారు. (రూ.80 లక్షల విలువైన ఫోన్లు చోరీ )

ఎస్‌ఐ కాంటాక్ట్స్‌లోని వారిని గుర్తించి గుంతకల్లుకు చెందిన మహమ్మద్‌ జాకీర్‌ఖాన్, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఖలీల్, 14 వార్డు ఇన్‌చార్జి వీరేష్‌ తదితరులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపారు. పరిచయం ఏర్పడిన వెంటనే హాయ్‌ అంటూ మెసేజ్‌ చేశారు. ‘యూ కెన్‌ హెల్ప్‌ మీ’ అంటూ చాటింగ్‌ ప్రారంభించారు. సహాయం చేయాలంటూ గూగుల్‌ పే, ఫోన్‌పే మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్‌ల ద్వారా డబ్బు పంపాలంటూ రిక్వెస్ట్‌లు పెట్టారు. దీంతో మహమ్మద్‌ జాకీర్‌ఖాన్‌ రూ.3వేలు పంపారు. ఖలీల్‌కు కూడా మెసేజ్‌ వచ్చింది. దీంతో ఈ యువకుడు గూగుల్‌ లేదా ఫోన్‌ పే నంబర్‌ చెప్పాలని కోరగా ప్రస్తుతం ఎస్‌ఐ సురేష్‌బాబు వినియోగిస్తున్న మొబైల్‌ నంబర్‌ కాకుండా పొంతనలేని నంబర్‌ ఇవ్వడంతో అనుమానం వచ్చి ఎస్‌ఐకు విషయాన్ని చేరవేశారు.

అప్రమత్తమైన ఎస్‌ఐ సురేష్‌బాబు తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా తప్పుడు మెసేజ్‌లు నమ్మవద్దని ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో పోస్ట్‌ పెట్టారు. ఫేస్‌బుక్‌లో లేదా వాట్సాప్‌ ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా చాటింగ్‌లు చేస్తూ మోసపోవద్దన్నారు. సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకొని డబ్బులు కాజేయడానికి తెర లేపారని, ఇలాంటి వారిపట్ల తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ విషయంపై సైబర్‌ క్రైం విభాగంలో ఫిర్యాదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. (మొబైల్‌ ఫోన్ల ఈఎమ్‌ఐ పేరిట భారీ మోసం)

మరిన్ని వార్తలు