కొంపముంచిన ప్రకటన! 20 రోజులు.. రూ.11.26 లక్షలు

10 Mar, 2022 10:57 IST|Sakshi

సాక్షి హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దండుకుంటున్న ఇద్దరు సైబర్‌ నేరస్తులను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ ఎస్‌. హరినాథ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. 

  • మల్కజ్‌గిరికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి నోరి సుబ్రమణ్యం లండన్‌కు చెందిన ట్రేడ్‌ క్లిఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ కంపెనీపై సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ను చూశాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ప్రకటన చూసి, ఆకర్షితుడైన అతను గతేడాది ఏప్రిల్‌ 2న తన పేరు నమోదు చేసుకున్నాడు. దీంతో అతనికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వచ్చింది. ఆ తర్వాత బాధితుడు తన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.3,07,800 నగదును అకౌంట్‌ నంబర్‌: 020405010053, ఐఎఫ్‌ఎస్‌సీ: ఐసీఐసీ0000204కు బదిలీ చేశాడు. తన తల్లి ఖాతాను క్రియేట్‌ చేసి మరోసారి రూ.3,07,800 నగదును కూడా పంపించాడు. ఇలా 20 రోజుల వ్యవధిలో వివిధ పేర్లతో ఖాతాలు తెరిచి ఆరు లావాదేవీల్లో రూ.8,20,800 సొమ్మును నిందితుల బ్యాంక్‌ ఖాతాకు బదిలీ చేశాడు. ఇదే సమయంలో బాధితుడు సుబ్రమణ్యంకు ట్రేడ్‌ క్లిఫ్‌ వెబ్‌సైట్‌ను సృష్టించిన వ్యక్తే క్రిప్టో గ్లోబల్‌ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.క్రిప్టోజీపీఆర్‌వో.కామ్‌) వెబ్‌సైట్‌ను కూడా క్రియేట్‌ చేసినట్లు తెలిసింది. ఈ వెబ్‌సైట్‌ను తన స్నేహితుడు సరూర్‌నగర్‌కు చెందిన ముక్తా నగేష్‌కు సూచించాడు. దీంతో ఈయన మూడు లావాదేవీల్లో అదే ఖాతా నంబర్‌కు రూ.3,06,180 నగదు బదిలీ చేశాడు. అయితే నగదు జమ అయ్యాక అటువైపు నుంచి నిందితుడు స్పందించడం మానేశారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. గతేడాది జూన్‌ 7న రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. మొత్తంగా ఇద్దరు బాధితుల నుంచి రూ.11,26,980 నగదును మోసగాళ్లు కొట్టేశారు. 
  • దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బ్యాంక్‌ ఖాతా నంబర్లు, ఇతర ఏజెన్సీల నుంచి సాంకేతిక ఆధారాలు సేకరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు అత్తాపూర్, నలంద నగర్‌లో ఉంటున్న బండ్లమూడి రవి, వేములవాడ రఘులను బుధవారం అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి ల్యాప్‌టాప్, మూడు సెల్‌ఫోన్లు, మూడు చెక్‌ బుక్‌లు, పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 
  • లక్నోకు చెందిన అన్నదమ్ములు వీర్‌ సింగ్, సందీప్‌లతో పరిచయం ఏర్పడ్డాక.. గత కొన్నేళ్లుగా రవి మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ పేరిట అమాయకులను మోసం చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వేములవాడ రఘుతో స్నేహం ఏర్పడింది. ఇద్దరు కలిసి ట్రేడింగ్‌ వ్యాపారం పేరిట జనాలను మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. మాస్టర్‌ ట్రేడర్స్, సూపర్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్, ట్రేడ్‌ క్లిఫ్, వాజిరాక్స్‌ ట్రేడింగ్‌ వెబ్‌సైట్లను సృష్టించారు. ఆయా లావాదేవీలను నిర్వహించేందుకు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, గోవాలతో బ్యాంక్‌ ఖాతాలను తెరిచారు.  
  • రవి ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌ మీడియాలో ట్రేడింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై విపరీతమైన ప్రచారం చేసేవాడు. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ స్కీమ్‌ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని పోస్ట్‌లు చేస్తుండేవాడు. వీటిని నమ్మిన అమాయకుల నుంచి అందినకాడికి దండుకొని వెబ్‌సైట్‌ను మూసేసి... కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభించేవారు. కాజేసిన సొమ్ములో రవి, రఘు, వీర్‌సింగ్‌ సమాన వాటాలు పంచుకునేవాళ్లు. సందీప్‌ సింగ్‌ ట్రేడింగ్‌ ఖాతాలను సమకూర్చినందుకు గాను కమీషన్‌ ఇచ్చేవారు.  

(చదవండి: ఒక్క ఫోన్‌ నెంబర్‌తో లూటీ... రెచ్చిపోయిన సైబర్‌ నేరగాళ్లు)

మరిన్ని వార్తలు