హలో.. మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా!

24 Jul, 2020 08:58 IST|Sakshi

కార్డు వివరాల కోసం తాజాగా తెలుగులో ఫోన్లు 

స్థానిక భాషలు నేర్చుకుంటున్న జమ్‌తార నేరగాళ్లు 

ఒకప్పుడు కేవలం ఇంగ్లీష్, హిందీల్లోనే ఫోన్‌ కాల్స్‌ 

అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ 

సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి... కార్డుల వివరాలతో పాటు ఓటీపీలు సైతం సంగ్రహించి... అందినకాడికి దండుకునే జమ్‌తార ముఠాలు స్థానిక భాషలను సైతం నేర్చుకున్నాయి. ఇటీవల కాలంలో నగరంలోని పలువురికి  ఈ ముఠాల నుంచి తెలుగులో ఫోన్లు వచ్చినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఒకప్పుడు హిందీ, ఇంగ్లీషుల్లో మాత్రమే మాట్లాడే ఈ నేరగాళ్లు .. ఆ పంథాలో అందరినీ బురిడీ కొట్టించడం సాధ్యం కావట్లేదనే స్థానిక భాషలపై దృష్టి పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి ఫోన్‌కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  

ఆ ప్రాంతమంతా అంతే... 
జార్ఖండ్‌ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్‌ వెళ్లే మార్గంలో ఉన్న ప్రాంతం జమ్‌తార. ల్యాప్‌టాప్స్, సెల్‌ఫోన్లతో కూర్చునే యువత దేశ వ్యాప్తంగా అనేక మందికి ‘గాలం’ వేస్తుంటాడు. నగరంలో నమోదవుతున్న ఈ ‘కార్డ్‌ క్రైమ్‌’లో 98 శాతం ఈ ప్రాంతానికి చెందిన వారే నిందితులు. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు అనేక మార్గాల ద్వారా డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల డేటా సేకరిస్తున్న జమ్‌తార మోసగాళ్లు వాటి ఆధారంగా అసలు అంకానికి తెరలేపుతున్నారు. బోగస్‌ పేర్లు, చిరునామాలతో సిమ్‌కార్డ్స్‌ తీసుకునే జమ్‌తార యువకులు వీటినే వినియోగించి కార్డుల డేటాలోని ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేస్తుంటారు. ఒకప్పుడు కేవలం హిందీ, ఇంగ్లీషు భాషల్లో సంభాషిస్తూ తాము బ్యాంకు మేనేజర్లమని పరిచయం చేసుకుని, కార్డు వివరాలతో పాటు ఓటీపీలు సంగ్రహించే వారు. అయితే ఈ భాషల్లో మాట్లాడితే టార్గెట్‌ చేసిన వారిలో కొందరికి అర్థం కావట్లేదనే ఉద్దేశంతో స్థానిక భాషలపై దృష్టి పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

వివిధ మార్గాల్లో నేర్చుకుంటూ... 
ఈ జమ్‌తార ముఠాలు తెలుగుతో పాటు వివిధ స్థానిక భాషలను ఇంటర్నెట్‌తో పాటు కొన్ని పుస్తకాల ద్వారా  నేర్చుకుంటున్నారని, వారు వినియోగిస్తున్న పదాలు, ఉచ్ఛారణ శైలిని పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతోందని పోలీసులంటున్నారు. అయితే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన వారికి వీరు ఫోన్లు చేసి స్థానిక భాషలో మాట్లాడటంతో నిజమే అని ఉచ్చులో పడుతున్నారని అంటున్నారు. మరోపక్క ఇటీవల కా>లంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్‌’ తరహా యాప్స్‌ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్‌ సిమ్‌కార్డుల్ని వినియోగిస్తున్న జమ్‌తార యువత ముందుగానే ఆ నంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్‌ హెడ్‌–ఆఫీస్‌’ పేరుతో రిజిస్టర్‌ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నంబర్‌ నుంచి వచ్చిన కాల్‌ను రిసీవ్‌ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలుగి తేలిగ్గా బుట్టలో పడుతున్నారు.  

అప్‌డేట్, లింకేజ్‌ పేర్లతో వల... 
క్రెడిట్, డెబిట్‌ కార్డులు కలిగిన వారికి ఫోన్లు చేసే జమ్‌తార నేరగాళ్లు  ముందుగా ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి పేరు, ఓ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి,... బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్‌ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్‌ కార్డు వివరాలు అప్‌డేట్‌ చెయ్యాలనో చెప్తుంటారు. సాధారణంగా ఆయా బ్యాంకులు జారీ చేసే కార్డులకు చెందిన నంబర్లలో మొదటి నాలుగైదు అంకెలూ ఒకే సిరీస్‌వి ఉంటాయి. వీటిని ముందుగా చెప్పే మాయగాళ్లు మిగతా అంకెలు అడుగుతారు. ఆపై సీవీవీ కోడ్‌ కూడా తెలుసుకుని... కొద్దిసేపట్లో మీకో వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుందని, అది కూడా చెప్తేనే లింకేజ్, అప్‌గ్రెడేషన్‌ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకోవడం, ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేయడం చేస్తూ టోకరా వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ డేటా ఆధారంగా క్లోన్డ్‌ క్రెడిట్, డెబిట్‌ కార్డులను తయారు చేసి డ్రా చేస్తునట్టు వెలుగులోకి వచ్చింది. వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలన్నీ తప్పుడు వివరాలతో ఉంటున్నాయని సైబర్‌ క్రైమ్‌ అధికారులు చెప్తున్నారు.  

వారి ఉచ్ఛారణ స్పష్టంగా ఉండదు 
జమ్‌తార నేరగాళ్లు మాట్లాడే తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉండదు. ఏ బ్యాంకు ఖాతాదారుడికి ఫోన్‌ చేసినా తాము ఎస్బీఐ మేనేజర్స్‌ అంటూ పరిచయం చేసుకుంటారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ఎంత తొందరలో ఉన్నా మీ వ్యక్తిగత వివరాలైన బ్యాంకు కార్డు నంబర్, సీవీవీ కోడ్, ఓటీపీ తదితరాలు చెప్పకూడదు. మరోపక్క ఏ బ్యాంకు అధికారులు ఫోన్‌లో వ్యక్తిగత వివరాలు, ఓటీపీ వంటివి అడగరు. కార్డుల అప్‌డేట్, లింకేజ్‌ ఏదైనా సరే బ్యాంకునకు నేరుగా వెళ్లో, వారి ఏటీఎం కేంద్రం ద్వారానో, అధికారిక వెబ్‌సైట్‌ నుంచో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకానీ ఇలా వచ్చే ఫోన్లను నమ్మకూడదు.  – సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

మరిన్ని వార్తలు