ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలున్న యువతులే టార్గెట్‌

24 Jul, 2020 08:25 IST|Sakshi
నిందితుడిని అరెస్టు చేసి తీసుకొస్తున్న పోలీసులు

ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలున్న యువతులే టార్గెట్‌

తెలుగు రాష్ట్రాల్లో వందల మంది బాధితులు 

ఇప్పటి వరకు సిటీలో 8 కేసులు గుర్తింపు 

నిందితుడిని అరెస్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా యాప్‌ ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా యువతులు, మహిళల్ని పరిచయం చేసుకొని.. కొన్నాళ్ల పాటు స్నేహంగా ఉంటూ చాటింగ్‌ చేస్తాడు... ఆపై తన వద్ద కొన్ని ‘ఫొటోలు’ ఉన్నాయంటూ బెదిరింపులకు దిగుతాడు... ఓ బాధితురాలి నుంచి వీలున్నంత వసూలు చేసిన తర్వాత ఆమె స్నేహితురాళ్లనే టార్గెట్‌గా చేసుకుంటాడు... ఈ పంథాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో వందల మందిని మోసం చేసిన ఓ బ్లాక్‌మెయిలర్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై సైబర్‌ క్రైమ్‌ ఠాణా సహా నగరంలోనే ఎనిమిది కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామని సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి గురువారం వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహ్మద్‌ అహ్మద్‌ ఆరో తరగతి వరకే చదివాడు. ఆపై తన స్వస్థలంలోనే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో ఖాతా ఉన్న ఇతగాడు దాని ద్వారానే మహిళలు, యువతులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తాడు. వాళ్లు యాక్సప్ట్‌ చేసిన తర్వాత కొన్నాళ్లు స్నేహపూర్వకంగా చాటింగ్‌ చేస్తాడు.

ఇలా వారి నమ్మకం పొందే అహ్మద్‌ సెల్‌ ఫోన్‌ నంబర్‌ తీసుకుంటాడు. ఆ తర్వాత నుంచి వాట్సాప్‌లో చాటింగ్, కాల్స్‌ చేసే ఇతగాడు ఎదుటి వారు పూర్తిగా తనను నమ్మారని నిర్థారించుకున్నాక అసలు పని ప్రారంభిస్తాడు. వారి ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతా నుంచి సంగ్రహించిన ఫొటోలను వారికే షేర్‌ చేస్తాడు. వీటితో పాటు తన వద్ద మరికొన్ని వ్యక్తిగత ఫొటోలు ఉన్నాయంటూ బెదిరిస్తాడు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకుండా ఉండాలంటే తాను కోరిన మొత్తం చెల్లించాలంటాడు. ఇలా టార్గెట్‌ చేసిన యువతి/మహిళ నుంచి అందినకాడికి తన ఖాతాల్లో డిపాజిట్‌ లేదా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుంటాడు. ఇలా ఓ బాధితురాలి నుంచి వసూలు చేయడం పూర్తయిన తర్వాత ఆమె పేరు, ఫొటోతో ఇన్‌స్ట్రాగామ్‌లోనే నకిలీ ఖాతా సృష్టిస్తాడు.

దీని ఆధారంగా ఆమె ఫ్రెండ్‌ లిస్ట్‌లోని యువతులు, మహిళలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తాడు. యాక్సప్ట్‌ చేసిన వారితో కొన్నాళ్లు చాటింగ్, కాల్స్‌ చేసి ఆపై బెదిరింపులకు దిగుతాడు. బాధితుల నుంచి డబ్బు వసూలు చేయడంతో పాటు తనతో సన్నిహితంగా ఉండాలనీ బెదిరిస్తాడు. ఇతడిపై నగరంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌తో పాటు కామాటిపుర, గోల్కొండ, నారాయణగూడ, మీర్‌చౌక్, ఫలక్‌నుమ, సంతోష్‌నగర్, నేరేడ్‌మెట్‌ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇతడి వల్లోపడి రూ.10 వేలు చెల్లించిన ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దీన్ని ఇన్‌స్పెక్టర్‌ బి.రమేష్‌ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి అహ్మద్‌ను నిందితుడిగా గుర్తించారు. ఆదోని వెళ్లిన ప్రత్యేక బృందం గురువారం అరెస్టు చేసి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వందల మందిని ఇతగాడు ఈ పంథాలో మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ వివరాలు సేకరించడానికి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా