ఎయిర్‌టెల్‌ కస్టమర్‌లే లక్ష్యం...

24 Jul, 2020 08:32 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘మీ ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డు మరో 24 గంటల్లో బ్లాక్‌  అవుతుందని.. కేవైసీఅప్‌డేట్‌ చేసుకోవాలి’ అని బల్క్‌ మెసేజ్‌లు పంపి..   ఆ తర్వాత సిమ్‌ బ్లాక్‌ చేసి లక్షలు కాజేస్తున్న సైబర్‌ మోసాలు పెరిగాయి.  ఈ విధంగా గత 9 రోజుల్లో మియాపూర్‌కు చెందిన అప్పలనాయుడు రూ.9,20,897, గచ్చిబౌలికి చెందిన  కౌశల్‌ కిశోర్‌ మిశ్రా రూ.5,94,799, సురేశ్‌ రమణ రూ.1,03, 990లు మోసపోయారని సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని గురువారం తెలిపారు. ‘కొన్నిరోజులుగా ఎయిర్‌టెల్‌ కస్టమర్స్‌కు సైబర్‌ నేరగాళ్లు బల్క్‌ మెసేజ్‌లు పంపిస్తున్నారు. మరో 24 గంటల్లో ఈ కేవైసీ అప్‌డేట్‌ చేయకపోతే సిమ్‌ కార్డు బ్లాక్‌ అవుతుందని సంక్షిప్త సమాచారాలు పంపిస్తున్నారు.

తర్వాత కస్టమర్‌ కేర్‌ ప్రతినిధిగా  కాల్‌ చేసి సిమ్‌ కార్డు కోసం కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌ నంబర్‌కు మెయిల్‌ ద్వారా పంపించాలని కోరుతున్నారు. ఆ తర్వాత ఎయిర్‌టెల్‌ నుంచి ఆటో జనరేటేడ్‌ మెసేజ్‌ను బాధితులకు పంపిస్తున్నారు. అనంతరం ఓ లింక్‌ను వారి సెల్‌ నంబర్‌కు పంపించడంతో అందులో బ్యాంక్‌ ఖాతా వివరాలు నింపడంతో నేరగాళ్లు వెంటనే ఆ సెల్‌ నంబర్‌ను బ్లాక్‌ చేస్తున్నారు. ఆ తర్వాత వీరు క్యూ ఆర్‌ కోడ్‌ సహాయంతో ఈ సిమ్‌ కార్డు యాక్టివ్‌ చేసి అందులో ఉన్న డబ్బులను ఇతర బ్యాంక్‌ ఖాతాలకు మళ్లించి లక్షలు కొల్లగొడుతున్నారు. గత తొమ్మిది రోజుల్లో రూ.16 లక్షలకుపైగా బాధితులు మోసపోయారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా