పోలీసులే టార్గెట్‌...

4 Sep, 2020 08:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌ కేంద్రంగా సైబర్‌ నేరగాళ్ళు పోలీసుల్ని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. అధికారుల ఫొటోలు, పేర్లు వినియోగించి కొత్త ఖాతాలు తెరుస్తున్నారు. వీటి ఆధారంగా ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపి, చాటింగ్‌ చేసి, డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలో ఉన్న అధికారులతో పాటు డీజీపీ కార్యాలయంలో పని చేసే వారి పేరుతోనూ ఈ నకిలీ ఖాతాలు తెరుచుకున్నాయి. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధిత అధికారులు యోచిస్తున్నారు. ఇలాంటి నేరగాళ్ల బారినపడకుండా ఉండటానికి కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు.  

పాత ఖాతాల ఆధారంగా కొత్త ఖాతాలు... 
ఈ తరహా నేరాలు చేయడానికి తెగబడుతున్న సైబర్‌ నేరగాళ్ళు ప్రాథమికంగా ఫేస్‌బుక్‌లోకి ప్రవేశిస్తున్నారు. వీలున్నన్ని ఖాతాల వివరాలు సెర్చ్‌ చేసి పోలీసు అధికారులకు చెందినవి గుర్తిస్తున్నారు. ఆ ఖాతాల్లో ఉన్న ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఆపై ఆ అధికారుల ప్రొఫైల్‌ నేమ్‌లు, డౌన్‌లోడ్‌ చేసిన ఫొటోలను వినియోగించి నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. ఈ కొత్త ఖాతాల నుంచి ఆయా అధికారుల ఫ్రెండ్స్‌ లిస్టులో ఉన్న వారికే మళ్ళీ ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపిస్తున్నారు. వీటిని చూస్తున్న ఎదుటి వ్యక్తులు ఆయా అధికారులే అనివార్య కారణాలతో మరో ఖాతా తెరిచి ఉంటారని భావించి యాక్సెప్ట్‌ చేస్తున్నారు. ఇది మొదటి ఘట్టం పూర్తయిన తర్వాత ఆ నకిలీ ఖాతాలు వినియోగించి కొన్నాళ్ళు ‘కొత్త ఫ్రెండ్స్‌’తో చాటింగ్‌ చేస్తున్నారు.  

అదును చూసుకుని డబ్బు అడుగుతూ... 
ఇలా కొన్ని రోజుల పాటు చాటింగ్‌ చేసినప్పటికీ విషయం అసలు అధికారుల్లో కొందరికి తెలియట్లేదు. దీంతో ఆ తర్వాత సైబర్‌ నేరగాళ్ళు అసలు కథ ప్రారంభిస్తున్నారు. తమకు అత్యవసరం ఉందంటూ ఈ నకిలీ ఖాతాల నుంచి అసలు వ్యక్తుల ఫ్రెండ్స్‌కు సందేశం పంపిస్తున్నారు. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పంపాలని, కొన్ని గంటల్లోనే తిరిగి ఇచ్చేస్తానంటూ ఈ–వాలెట్స్‌లోని బదిలీ చేయించుకుంటున్నారు. అయితే అనేక మంది ‘స్నేహితులు’ మాత్రం నకిలీ ఖాతా నుంచి డబ్బు ప్రస్తావన వచ్చిన వెంటనే అసలు వ్యక్తుల్ని సంప్రదించి అప్రమత్తం చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో కొత్తగా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చిన వెంటనే అసలు వ్యక్తుల్ని సంప్రదించి విషయం చెప్తున్నారు. దీంతో ఇటీవల కొందరు అధికారులు తమ అసలు ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారానే నకిలీ ఖాతాలపై అప్రమత్తం చేయడం మొదలెట్టారు. ఇప్పటికే బాధితులుగా మారిన వారిలో కొందరు డిపాజిట్‌ అయింది చిన్న మొత్తమే అని వదిలేస్తుండగా... సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారు.  

ఈ–మెయిల్‌ తరహాలో ఉంటే మేలు... 
ఈ తరహా సైబర్‌ నేరగాళ్ళ వద్ద బాధితులుగా మారకుండా ఉండటానికి కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతాలోని ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసుకునే, ఫ్రెండ్స్‌ లిస్టులు చూసే అవకాశం ఉంటేనే ఇలాంటి నేరాల జరిగేందుకు ఆస్కారం ఉంటుదని చెప్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ ఫేస్‌బుక్‌ ఖాతా ప్రైవసీ సెట్టింగ్స్‌ మార్చాలని సూచిస్తున్నారు. ఇవి కేవలం ఫ్రెండ్స్‌కు మాత్రమే కనిపించేలా సెట్‌ చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. మరోపక్క ఇలాంటి నేరాలు చోటు చేసుకోకుండా ఉండటానికి ఫేస్‌బుక్‌ నిర్వాహకులు కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉందని చెప్తున్నారు. సాధారణంగా ఈ–మెయిల్‌ క్రియేట్‌ చేసేప్పుడు అప్పటికే నమోదై ఉన్న యూజర్‌ నేమ్‌ను మరొకరు తమ నేమ్‌గా పెట్టుకోవడానికి ఆస్కారం ఉండదు. దానికి కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఫేస్‌బుక్‌లో మాత్రం ఒకే యూజర్‌ నేమ్‌ ఎందరైనా వినియోగించుకోవచ్చు. ఈ ఖాతాలను ఈ–మెయిల్‌ మాదిరిగా మారిస్తే ఇలాంటి నేరాలు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా