అప్పులు తీర్చేందుకు కిడ్నీలు అమ్మాలని..

14 Jul, 2021 01:28 IST|Sakshi

ఆన్‌లైన్‌లో ప్రయత్నించి సైబర్‌ ఎరకు చిక్కిన దంపతులు

రూ. 40 లక్షలు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు

ఇల్లు కట్టుకునేందుకు ఆ దంపతులు రూ. కోటికి పైగా అప్పులు చేశారు. కరోనాతో వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థికంగా చితికిపోయారు. అప్పులు ఇచ్చినవాళ్లు ఒత్తిడి చేయడంతో చేసేదిలేక ఒక్కో కిడ్నీ అమ్మడానికి నిర్ణయించుకున్నారు. కిడ్నీ అవసరమైన వాళ్ల నెంబర్‌కోసం గూగుల్‌ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కుకుని రూ. 40 లక్షలు పోగొట్టుకున్నారు. దెబ్బమీద దెబ్బపడటంతో ఆ దంపతులు విలవిల్లాడుతున్నారు.

హిమాయత్‌నగర్‌: ఎం.ఎస్‌.మక్తాలో నివసించే మోడీ వెంకటేష్, లావణ్యలకు ఇద్దరు పిల్లలు. బుక్‌స్టాల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితం తాము ఉండే ప్రదేశంలో ఓ ఖరీదైన ఇల్లును నిర్మించుకున్నారు. దీనికి రూ.కోటి పైనే అప్పులు చేశారు. గత ఏడాది, ఈ ఏడాది కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో బుక్‌స్టాల్‌ వ్యాపారం మూతపడింది. దీంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వాళ్లు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. చేసేది లేక ఆ దంపతులు తమ ఒక్కో కిడ్నీని అమ్మి, కష్టాల నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నారు. 

సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కి... 
కిడ్నీ అవసరమైన వాళ్లకోసం ఆ దంపతులు గూగుల్లో సెర్చ్‌ చేయగా ఓ ఫోన్‌ నంబర్‌ దొరికింది. అతడికి కాల్‌ చేయగా.. ఢిల్లీలోని ‘హోప్‌ కిడ్నీ సెంటర్‌’లో మీ కిడ్నీ తీసుకునేలా ఏర్పాటు చేస్తాను, ఒక్కో కిడ్నీకి రూ.5 కోట్లు వచ్చేలా సహకరిస్తానని నమ్మించాడు. ఇందుకు గాను ప్రాసెసింగ్, వైద్యుల కమీషన్‌ తదితర వాటికి రూ.4 లక్షలు ఇవ్వమని కోరాడు. దీంతో ఆ దంపతులు ఆ మొత్తం చెల్లించారు. అనంతరం మరోసారి డబ్బులు అడగడంతో అనుమానం వచ్చి డబ్బు పంపించడం మానుకున్నారు. అనంతరం మరోసారి గూగుల్లోనే వెతికి ఇంకో నంబర్‌ను సంప్రదించారు. అతను కూడా వీరిని నమ్మించి రూ.9 లక్షలు కాజేశాడు. ఇలా నాలుగు పర్యాయాలు ప్రయత్నించి సైబర్‌ నేరగాళ్ల ఖాతాలో రూ.40 లక్షలు జమచేశారు. చివరకు మోసపోయామని గ్రహించి మంగళవారం సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

మరిన్ని వార్తలు