కియాలో డీలర్‌షిప్‌ ఇస్తామంటూ మోసం

12 Apr, 2022 07:25 IST|Sakshi

 హిమాయత్‌నగర్‌: ప్రముఖ కార్ల కంపెనీ కియా ఇండియా డీలర్‌షిప్‌ నీదేనంటూ గుడిమల్కాపూర్‌కు చెందిన ఓ వ్యాపార వేత్తకు సైబర్‌ నేరగాళ్లు వల వేశారు. పలు డాక్యుమెంట్ల రూపంలో అతడి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేశారు. డీలర్‌షిప్‌ ఇవ్వకపోవడంతో సోమవారం బాధితుడు సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఏసీపీ కేవీఏ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రమణకుమార్‌ కియా కార్ల డీలర్‌షిప్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశాడు. దీంతో ఇటీవల ఓ వ్యక్తి కాల్‌ చేసి తాను కియా కంపెనీకి సంబంధించిన వ్యక్తినని తెలిపాడు. ఇండియా డీలర్‌షిప్‌ ఇస్తామంటూ నమ్మించాడు. పలు డాక్యుమెంట్స్‌ తదితర ఖర్చులంటూ రూ.11లక్షలు దోచుకున్నారు. డీలర్‌షిప్‌ ఆలస్యం కావడంతో ఇదంతా బోగస్‌ అని గుర్తించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. 

క్రిప్టోకరెన్సీ పేరుతో రూ.25 లక్షలు స్వాహా.. 
క్రిప్టో కరెన్సీలో లాభాలు ఇస్తామంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన గుంజన్‌శర్మ క్రిప్టోకరెన్సీలో బినాన్స్‌ కొనుగోలు చేసి వాటిని జీడీఎక్స్‌ అనే యాప్‌లో పెట్టుబడిగా రూ.25లక్షలు పెట్టాడు. ఆ మొత్తానికి లాభాలు చూపిస్తున్నారే కానీ డబ్బు డ్రా చేసేందుకు ఇవ్వట్లేదు. వారి నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఇదంతా ఫేక్‌ అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ చెప్పారు. 

(చదవండి: పోలీసు కస్టడీకి అభిషేక్, అనిల్‌ )

మరిన్ని వార్తలు