రిటైర్డ్‌ ఉద్యోగి ఖాతాల్లో నుంచి రూ.2.30 లక్షలు మాయం

9 Dec, 2021 13:20 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న భిక్షపతి, ఆయన భార్య కళావతి

సాక్షి, మహబూబాబాద్‌(వరంగల్‌): రిటైర్డ్‌ ఉద్యోగి ఖాతాలోనుంచి రూ.2.30 లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటన మానుకోట జిల్లా కేంద్రంలోని సిగ్నల్‌ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. మాజీ సైనికుడు పెద్దబోయిన భిక్షపతి మానుకోట సిగ్నల్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈయనకు ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలో రూ.95 వేలు, ఇండియన్‌ బ్యాంకు ఖాతాలో రూ.35 వేలు మాయమయ్యాయి.

బాధితుడు భిక్షపతి ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలో చెక్‌బుక్‌ కోసమని దరఖాస్తు చేయగా వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి మాట్లాడి ఫోన్‌ పెట్టేయగానే మరో నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అవతలి వ్యక్తులు వివరాలు అడగగానే బ్యాంకు వారే అనుకుని వారు అడిగిన సమాచారం అందించి ఫోన్‌ కట్‌చేశాడు. ఆ వెంటనే ఆయన ఫోన్‌కు రూ.2.30 లక్షలు ఉపసంహరణ (డ్రా) అయినట్లు మెసేజ్‌ వచ్చింది. సదరు మూడు బ్యాంకు ఖాతాలకు ఒకే ఫోన్‌నంబర్‌ లింకు చేశారు.

బ్యాంకు అధికారులు అనుకుని గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్‌కు స్పందించి సమాచారం ఇవ్వడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. బ్యాంకు ఖాతాల్లో నగదు పోయినట్లు గుర్తించి వెంటనే బ్యాంకులకు వెళ్లి ఆరాతీయగా ఆయన  ఖాతాల్లోని నగదు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంకు ఖాతాలను బ్లాక్‌ చేశారు.

తనకు మోసం జరిగిందని గుర్తించిన సదరు బాధితుడు భిక్షపతి, మహబూబాబాద్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సైబర్‌ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరో వారం రోజుల్లో భిక్షపతికి కేన్సర్‌ చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా ఇంతపెద్ద గోరం జరిగిందని గుండె బాదుకుంటూ బోరున విలపించాడు. పోలీసులు, బ్యాంకు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరాడు.  

చదవండి: వివాహితతో పరిచయం .. చేనులోకి బలవంతంగా తీసుకెళ్లి..

మరిన్ని వార్తలు