మార్కెట్‌ బాక్స్‌ మాయ: తొలుత రూ.10 లక్షలకు 14.9 లక్షలు.. తిరిగి 62 లక్షలు..

30 Aug, 2022 04:26 IST|Sakshi
వివరాలు తెలియజేస్తున్న సైబరాబాద్‌  కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర  

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో ఘరానా మోసం 

నకిలీ యాప్‌తో బురిడీకొట్టించిన ముఠా గుట్టురట్టు 

నలుగురు అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్‌ 

రూ.9.81 కోట్లు స్వాధీనం.. సైబర్‌ క్రైంలో దేశంలోనే అతిపెద్ద రికవరీ 

గచ్చిబౌలి: మార్కెట్‌ బాక్స్‌... అదో నకిలీ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌. ఆ యాప్‌లో రిజిస్టర్‌ అయి లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ఉసిగొల్పి అందిన కాడికి దండుకొని బిచాణ ఎత్తేశారు. ఇలా మోసాలకు పాల్పడిన నలుగురు సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సైబర్‌ క్రైంలో దేశంలోనే మొదటిసారిగా రూ.9.81 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముగల్‌సరాయ్‌కి చెందిన కమోడిటీ ట్రేడర్‌ అభిషేక్‌ జైన్‌ (32) మార్కెట్‌ బాక్స్‌ అనే ఫేక్‌ ట్రేడింగ్‌ యాప్‌ను రూపొందించాడు. వాట్సాప్, టెలి గ్రామ్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు.

దేశవ్యాప్తంగా వేలాది మంది రిజిస్టర్‌ అయ్యారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి తొలుత రూ.10 లక్షలు ఇందులో పెట్టగా, తిరిగి రూ.14.9 లక్షలు వచ్చా యి. దీంతో ఆయన ఈసారి రూ.62 లక్షలు పెట్టా రు. అయితే, కేవలం రూ.34.7 లక్షలే వచ్చాయి. రూ.27 లక్షలకుపైగా నష్టం వచ్చింది. దీంతో 2021 డిసెంబర్‌ 4న సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేసి యూపీ, రాజస్తాన్‌కు చెందిన ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. ఇలా వేలాది మందిని మోసగించిన అభిషేక్‌ జైన్‌తోపాటు కృష్ణ కుమార్‌ (38), పవన్‌ కుమార్‌ ప్రజాపట్‌ (35), ఆకాశ్‌రాయ్‌ (39)లను అరెస్ట్‌చేశారు. 

ఉన్నది లేనట్లుగా చూపించి... 
మార్కెట్‌ బాక్స్‌లో మూడువేల మంది రిజిస్టర్‌ అయ్యారని సీపీ స్టీఫెన్‌ చెప్పారు. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)లో రిజిస్టర్‌ కాకుండా నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా లాభాల్లో ఉన్నట్లు కనిపించేలా చూపిస్తారన్నారు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు ఇచ్చి నమ్మకాన్ని చూరగొంటారని, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన తరువాత డబ్బు లు కాజేస్తారని వివరించారు.

వివిధ బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి ఒకచోట ఉంచారని, యూపీ పోలీసుల సహకారంతో రూ.9.81 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమావేశంలో సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్, ఏడీసీపీ రితురాజ్, ఏసీపీ శ్రీధర్, సీఐలు శ్రీనివాస్, అవినాష్‌ రెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు