మహిళలే టార్గెట్ ‌: కొత్త డిజైన్స్‌ అంటూ టోకరా

16 Apr, 2021 08:40 IST|Sakshi

నగలు చేయిస్తానని ఎర!  బంగారు ఆభరణాలతో ఉడాయింపు  

కేటుగాడిని అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు 

నిందితుడిపై తెలంగాణ, ఏపీల్లో 14 కేసులు 

సాక్షి, గచ్చిబౌలి: చిరు వ్యాపారాలు చేసే మహిళలకు ఫైనాన్స్‌ ఇస్తానని... కొత్త డిజైన్లలో నగలు చేయిస్తానని మాయమాటలు చెప్పి బంగారు ఆభరణాలతో ఉడాయిస్తున్న ఓ  ఘరానా మోసగాడిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు.  గచ్చిబౌలిలోని మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో గురువారం డీసీపీ వెంటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం...
 
  విశాఖపట్నం జిల్లా కేశవరం గ్రామానికి చెందిన  మేడిశెట్టి చిట్టిబాబు అలియాస్‌ చిట్టి అలియాస్‌ అప్పారావు పదో తరగతి చదివి కెమికల్‌ ఫ్యాక్టరీలో కొద్ది రోజులు పని చేశాడు. 
  గ్రామాల్లోని మధ్య వయసు గల  మహిళలకు మాయమాటలు చెప్పి బంగారు నగలతో ఉడాయించడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా,  21 ఆగస్టు 2020న బెయిల్‌పై బయటకు వచ్చాడు.  
తర్వాత బాధితులు తన ఇంటికి వచ్చి గొడవ చేయడంతో హైదరాబాద్‌కు వచ్చి రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో ఉంటున్నాడు.  
నార్సింగి పీఎస్‌ పరిధిలోని కాళీ మందిర్‌ సమీపంలో కల్లు విక్రయించే ఓ మహిళ ఒంటిపై ఉన్న నగలపై కన్నేసిన ఇతగాడు ఫైనాన్స్‌ ఇస్తానని చెప్పాడు. తన ఒంటిపై ఉన్న రోల్డ్‌ గోల్డ్‌ నగలను చూపించి ఇదే డిజైన్‌తో నగలు చేయిస్తానని నమ్మబలికాడు. 
ఆమె నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని ఉడాయించాడు.  
మరుసటి రోజు ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ రావడంతో బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
ఇదే తరహాలో మంచిరేవులలో పూలు అమ్ముకొనే ఓ మహిళను బురిడీ కొట్టించి 2 తులాల ఆభరణాలతో ఉడాయించాడు. 
రాజేంద్రనగర్, లంగర్‌హౌస్‌ పీఎస్‌ల పరిధిల్లోనూ ముగ్గురు మహిళలను మోసగించాడు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసుల నమోదు చేసిన నార్సింగ్‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 10.4 తులాల ఆభరణాలు, సెల్‌ ఫోన్, గ్లామర్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

14 కేసుల్లో నిందితుడు: 
తెలంగాణాలోని నార్సింగిలో 2, రాజేంద్రనగర్‌లో 2, లంగర్‌హౌస్‌లో ఒక కేసులో మేడిశెట్టి చిట్టిబాబు నిందితుడుగా కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పోలీసుస్టేషన్లలో 9 కేసులు ఉన్నాయి. నిందితునిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. కేసును ఛేదించిన సీసీఎస్, నార్సింగి పోలీసులలకు రివార్డు అందజేశారు.  విలేకరుల సమావేశంలో ఎస్‌టీఎప్‌ ఏసీపీ శ్యాంబాబు, మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌ రావు, సీసీఎస్‌ సీఐ వాసు, నార్సిగి సీఐ గంగాధర్, డీఐ బాలరాజు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు