డేటా ఎక్కడి నుంచి లీకైంది?

26 Mar, 2023 04:21 IST|Sakshi
డేటా చోరీ కేసు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు(ఫైల్‌)

వ్యక్తిగత వివరాల చోరీ కేసులో సూత్రధారుల కోసం మొదలైన వేట 

దర్యాప్తు ముమ్మరం చేసిన సైబరాబాద్‌ పోలీసులు 

నిందితులు డేటాను హార్డ్‌డిస్క్‌లు, క్లౌడ్‌లో భద్రపరిచినట్టు గుర్తింపు 

దాన్ని యాక్సెస్‌ చేసేందుకు గూగుల్‌కు లేఖ 

ఆర్‌బీఐ, రక్షణ, హోంశాఖ, టెలికం విభాగాలకు అలర్ట్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘వ్యక్తిగత డేటా లీక్‌’మూలాలను తేల్చేందుకు సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎక్కడెక్కడి నుంచి డేటా తస్కరణకు గురైంది? నిందితులు దీనిని ఎక్కడెక్కడ దాచి ఉంచారు? దానిని ఎవరెవరు కొనుగోలు చేశారు? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. రక్షణ శాఖ, టెలికం వంటి 138 ప్రభుత్వ విభాగాలుసహా 16.8 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను తస్కరించి, విక్రయిస్తున్న ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను సైబరాబాద్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీ, పలు ఇతర ప్రాంతాల్లోని పలు కంపెనీల నుంచి డేటా చోరీ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించి ఆయా సంస్థలకు నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. కేసుతో వారికి ఉన్న సంబంధాలపై విచారించిన అనంతరం మరిన్ని అరెస్టులు ఉండే అవకా శం ఉన్నట్టు సమాచారం. ఈ డేటా ఎవరెవరు కొనుగోలు చేశారో కనిపెట్టేందుకు నిందితులను కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. 

క్లౌడ్, హార్డ్‌ డిస్క్‌లలో డేటా.. 
ప్రజల వ్యక్తిగత వివరాలను తస్కరించిన నిందితులు డేటాను హార్డ్‌ డిస్క్‌లతోపాటు క్లౌడ్‌ సర్వీస్లో భద్రపరిచినట్టు పోలీసులు గుర్తించారు. ఆ క్లౌడ్‌ సర్వీస్‌ను యాక్సెస్‌ చేయడానికి అనుమతించాలని కోరుతూ గూగుల్‌కు లేఖ రాసినట్టు తెలిసింది. ప్రాథమిక దర్యాప్తు మేరకు 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటాను తస్కరించినట్టు గుర్తించామని, క్లౌడ్‌లోని డేటాను ఫోరెన్సిక్‌ విశ్లేషణ చేస్తే.. దొంగిలించిన డేటా మొత్తం ఎంత అనేది స్పష్టమవుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. 

ప్రభుత్వ విభాగాలకు అలర్ట్‌ 
నీట్‌ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ అధికారులు, బ్యాంకు ఖాతాదారులు, పాన్‌కార్డు వినియోగదారులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, వివిధ రంగాలకు చెందిన నిపుణులు వంటి 138 కేటగిరీల వారి డేటాను నిందితులు దొంగిలించారు. అయితే వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలూ చోరీకి గురైన నేపథ్యంలో.. ఆయా ప్రభుత్వ శాఖలను సైబరాబాద్‌ పోలీసులు అప్రమత్తం చేశారు. ఈమేరకు రిజర్వు బ్యాంకు, టెలికం విభాగం, కేంద్ర హోం, రక్షణ శాఖలకు లేఖలు రాశారు. 

ఏజెన్సీల నుంచే డిఫెన్స్‌ సమాచారం లీక్‌? 
రక్షణ శాఖకు చెందిన 2.6 లక్షల మంది ఉద్యోగుల డేటాను సైతం నిందితులు దొంగిలించారు. వీటిలో డిఫెన్స్‌ అధికారి పేరు, ఈ–మెయిల్‌ ఐడీ, దళం పేరు, ర్యాంకు, పనిచేస్తున్న చోటు, చిరు నామా వంటి కీలక వివరాలున్నాయి. రక్షణశాఖకు చెందిన ఖాతాల నిర్వహణ బాధ్యతలను ఔట్‌ సోర్సింగ్‌కు ఇచ్చారని.. ఆ ఏజెన్సీల నుంచే డేటా చోరీకి గురై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల వేతన ఖాతాలున్న బ్యాంకు నుంచి లేదా పేస్లిప్‌లను సిద్ధం చేసే ఏజెన్సీల నుంచి డేటా లీకై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు