ఓటీపీతో లూటీ 

25 Jul, 2022 07:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలికి చెందిన శ్రీనివాస్‌ హైటెక్‌ సిటీలో ఐటీ ఉద్యోగి. శనివారం ఉదయం ఆన్‌ లైన్‌ డెలివరీ బాయ్‌ ఫోన్‌ చేసి ‘సార్‌ మీకు డెలివరీ వచ్చింది. అడ్రెస్‌ ఎక్కడ అని అడిగాడు. అదేంటి నేనేమి ఆర్డర్‌ చేయలేదుగా డెలివరీ రావటం ఏంటని ప్రశ్నచాడు. అవునా అయితే ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేస్తాను మీ ఫోన్‌ కి వచ్చిన ఓటీపీ చెప్పండని అడిగాడు బాయ్‌.

సరే అని మెసేజ్‌లోని ఓటీపీ చెప్పాడు. అంతే క్షణాల్లో బ్యాంక్‌ ఖాతాలో అమౌంట్‌ ఖాళీ అయింద్ఙి ... ఇలా డెలివరీ బాయ్‌ స్కామ్‌ పేరిట సైబర్‌ నేరస్తులు లూటీ చేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఇలాంటి మోసాల కేసులు నమోదవుతున్నాయి.

ఏమవుతుందో తెలియక బాధితులు ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు. డిజిటల్‌ లావాదేవీల్లో ఓటీపీ తెలుసుకొని సులభంగా నగదు కొట్టేస్తున్నారు సైబర్‌ నేరస్తులు. ఎంతో కీలకమైన ఓటీపీలను బాధితుల నుంచి చెప్పించుకునేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు.  

డార్క్‌ వెబ్‌ నుంచి...  
సైబర్‌ నేరస్తులు ముందుగానే డార్క్‌ వెబ్‌ నుంచి మన ఫోన్‌ నెంబర్, అది అనుసంధానమై ఉన్న బ్యాంక్‌ ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత బాధితులకు ఫోన్‌ చేసి మీరు ఆర్డర్‌ చేశారు కదా డెలివరీకి వచ్చాను మీ వీధిలోనే ఉన్నానని చెబుతున్నారు.

నేను ఆర్డర్‌ ఇవ్వలేదని బాధితులు చెప్పగానే అయితే ఓటీపీ చెప్పండి క్యాన్సిల్‌ చేస్తామని నమ్మిస్తున్నారు. ఓటీపీ చెప్పగానే సెకన్లలో ఫోన్‌ ను హ్యాక్‌ చేసి బ్యాంక్‌ ఖాతా ఖాళీ చేస్తున్నారు. 

ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు  
ఓటీపీ అనేది ఆన్‌ లైన్‌ లో జరిపే లావాదేవి. అది మీకు మాత్రమే వస్తుంది. కొన్ని సెకన్లు మాత్రమే గడువు ఉంటుంది. ఎవరో పంపిస్తే ఓటీపీ రాదు. తెలియక ఓటీపీ చెప్పారంటే మీ బ్యాంక్‌ వివరాలు ఇతరులకు మీరే ఇచ్చినట్టు. ఎట్టిపరిస్థితుల్లో ఓటీపీ ఎవరికీ చెప్పకూడదు. 
– జీ శ్రీధర్, ఏసీపీ, సైబర్‌ క్రైమ్, సైబరాబాద్‌  

(చదవండి: పదేళ్ల అన్వేషణకు తెర)

మరిన్ని వార్తలు