తెలంగాణ కానిస్టేబుల్‌ 'అక్రమ రూట్‌'

19 Nov, 2021 04:06 IST|Sakshi

పెట్రోలింగ్‌ వాహనంలో మద్యాన్ని సరిహద్దులు దాటిస్తున్న వైనం.. అరెస్టు చేసిన దాచేపల్లి పోలీసులు

దాచేపల్లి(గురజాల): పెట్రోలింగ్‌ వాహనంతో అక్రమంగా మద్యాన్ని సరిహద్దులు దాటిస్తున్న తెలంగాణ కానిస్టేబుల్‌ను దాచేపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వివరాలను ఎస్‌ఐ షేక్‌ రహ్మతుల్లా గురువారం విలేకరులకు వెల్లడించారు. శ్రావణ్‌కుమార్‌ తెలంగాణలోని వాడపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 14వ తేదీ రాత్రి 650 మద్యం సీసాలతో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనంలో తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చాడు. పోలీస్‌ వాహనం కావడంతో రాష్ట్ర సరిహద్దులో సిబ్బంది తనిఖీ చేయకుండా వదిలిపెట్టారు. శ్రావణ్‌ ఆ మద్యం సీసాలను రామాపురం అడ్డరోడ్డు సమీపంలోని పొదల్లో దాచిపెట్టాడు.

అనంతరం పెట్రోలింగ్‌ వాహనాన్ని తాను పనిచేస్తున్న పోలీస్‌స్టేషన్‌లో వదిలేసి.. మద్యం సీసాలు దాచిన ప్రదేశానికి తిరిగి చేరుకున్నాడు. వాటిని తీసుకెళ్లేందుకు నరసరావుపేటకు చెందిన కోటేశ్వరరావు కూడా అప్పటికే అక్కడకు వచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు దాడిచేసి వారిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. మద్యాన్ని, కోటేశ్వరరావు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు