దగ్గుబాటి అభిరామ్‌ కారుకు ప్రమాదం

13 Aug, 2020 08:44 IST|Sakshi

గచ్చిబౌలి: ఓ వ్యక్తి టెస్ట్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా బ్రీజా కారు, యువ హీరో దగ్గుబాటి రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్‌ బీఎండబ్ల్యూ కారు మణికొండలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవిందర్‌ సమాచారం మేరకు... కరీంనగర్‌ జిల్లా ఆరేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మెకానిక్‌ లక్ష్మణ్‌ ద్వారా బ్రీజా కారు కొనేందుకు నగరానికి వచ్చాడు. మణికొండలో యజమాని నుంచి టెస్ట్‌ డ్రైవ్‌ కోసం కారు తీసుకొని స్నేహితుడు సతీష్‌ కలిసి  డ్రైవ్‌కు వెళ్లాడు.

పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్‌ హౌస్‌ వద్ద పక్క రోడ్డులోంచి వచ్చినా బీఎండబ్ల్యూ కారు, బ్రీజా కారు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. రాజుతో పాటు దగ్గుబాటి అభిరామ్‌లు బుధవారం సాయంత్రం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బ్రీజా కారు ఎక్కువగా డ్యామేజీ అయ్యిందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. కారు నడిపిన ఇద్దరికీ బ్రీత్‌ ఎనలైజర్‌ చేయగా ఎవరూ మద్యం మత్తులో లేరని తేలిందన్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తేనే తప్పు ఎవరిదనే విషయం తెలుస్తుందన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు