రెండేళ్ల దళిత బాలుడు... ఆలయంలోకి ప్రవేశించాడని జరిమానా

23 Sep, 2021 06:12 IST|Sakshi

ఆలయాన్ని శుద్ధి చేయడానికి రూ. 25,000 చెల్లించాలని ఆదేశం

కొప్పాల్‌: ఆధునిక యుగంలోనూ కుల వివక్ష యథాతథంగా కొనసాగుతోందనడానికి ఇది మరో నిదర్శనం. రెండేళ్ల దళిత బాలుడు ప్రవేశించడం వల్ల గ్రామంలోని హనుమాన్‌ ఆలయం మైలపడిందని, దాన్ని శుద్ధి చేయడం కోసమంటూ బాలుని కుటుంబానికి రూ.25వేల జరిమానా విధించారు. కర్ణాటకలోని కొప్పాల్‌ జిల్లాలో మియాపూర్‌ గ్రామంలో ఈ నెల 4వ తేదీన ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌చేశారు. మియాపూర్‌లో చెన్నదాసరి కులానికి చెందిన చంద్రశేఖర్‌కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ నెల 4న అతడి పుట్టినరోజు కావడంతో హనుమంతుడి ఆశీస్సుల కోసం గుడికి తీసుకెళ్లాడు.

చంద్రశేఖర్‌తోపాటు కుటుంబ సభ్యులంతా గుడి బయటే ఉండిపోయారు. బాలుడు లోపలికి వెళ్లొచ్చాడు. ఇది గమనించిన ఆలయ పూజారులు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. 11న పంచాయితీ పెట్టారు. హనుమంతుడి› ఆలయాన్ని శుద్ధి చేయడానికి జరిమానా కింద రూ.25,000 చెల్లించాలని బాలుని తండ్రిని ఆదేశించారు.  సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బాలచంద్ర సంగనాల్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో పోలీసుల సమక్షంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చెన్నదాసరితో సహా అన్ని కులాల ప్రజలు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు