ఆలయంలోకి ప్రవేశించోద్దని పెళ్లి బృందంపై దాడి..

18 Jul, 2021 19:13 IST|Sakshi

భోపాల్‌: దేశంలో దళితులపై వివక్షతను రూపుమాపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికి కొన్ని చోట్ల దళితులు, గిరిజనులు వివక్షతను ఎదుర్కొంటున్న సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు .. ఇండోర్‌ జిల్లాకు చెందిన వికాస్‌ కల్మోడియా అనే గిరిజన యువకుడు వివాహం చేసుకున్నాడు.

ఈ క్రమంలో, అతను స్థానిక ఆలయానికి చేరుకున్నాడు. కొంత మంది యువకులు పెళ్లి బృందాన్ని ఆలయంలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వరుడి బంధువులు ఆలయంలో ప్రవేశించేది లేదని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా, వివాహ బృందంపై దాడికి తెగపడ్డారు. ఈ క్రమంలో వరుడి తండ్రి ఓం ప్రకాశ్‌ తమపై దాడిచేసిన యువకులపై స్థానిక మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివాహ బృందాన్ని భారీ భద్రత మధ్య ఆలయ దర్శనం కల్పించారు. ఆ తర్వాత నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరితో పాటు మరో 9 మంది గుర్తు తెలియని యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసులను నమోదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న మన్పూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు