జెండా ఎగురవేశాడని దళిత సర్పంచ్‌పై సెక్రటరీ పిడిగుద్దులు..

16 Aug, 2021 13:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో అమానుషమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక దళిత వ్యక్తి జాతీయజెండాను ఎగురవేశాడనే కోపంతో.. ఆ గ్రామ కార్యదర్శి అతనిపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికుల ప్రకారం.. ఈ సంఘటన బుందేల్‌ ఖండ్‌లో జరిగింది. కాగా, నిన్న (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఛత్తర్‌పూర్‌లోని ధాంచీ గ్రామస్తులు..  స్థానిక పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో  సదరు గ్రామ కార్యదర్శి సునీల్‌ తివారి సమయానికి రాలేదు.

దీంతో గ్రామస్తులు సర్పంచ్‌ హన్ను బాసర్‌ను జెండా ఎగురవేయాలని కోరారు. వారి కోరిక మేరకు.. హన్ను బాసర్‌ జెండాను ఎగురవేశాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న సునీల్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. తనను కాదని.. నువ్వు జెండా ఎలా ఎగురవేశావని ప్రశ్నించారు. కోపంతో విచక్షణ కోల్పోయిన సెక్రెటరీ..  దళిత సర్పంచ్‌పై పిడిగుద్దులు కురిపిస్తు దాడికి తెగబడ్డాడు.

అంతటితో ఆగకుండా.. అడ్డు వచ్చిన సర్పంచ్‌ భార్య.. కోడలిపై కూడా దాడిచేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కార్యదర్శిపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సర్పంచ్‌, అతని భార్య.. సెక్రెటరీ సునీల్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఘటనపై కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు