-

Dammaiguda: బాలిక కిడ్నాప్‌నకు యత్నం, తల్లి అప్రమత్తవడంతో

10 Jul, 2021 09:15 IST|Sakshi

దమ్మాయిగూడ పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టిన పోలీసులు

మైనర్‌ బాలిక హత్యాచారయత్నంపై రాచకొండ సీపీ సీరియస్

మరో బాలిక కిడ్నాప్‌ యత్నం.. పారిపోయిన నిందితుడు

పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం?

సాక్షి, జవహర్‌నగర్‌: ఇటీవల దమ్మాయిగూడలో ఓ నాలుగేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్యాచారయత్నానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితుడి కోసం రాచకొండ పోలీసులు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఘటన జరిగిన దమ్మాయిగూడ పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలు నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నాలు నిర్వహిస్తుండటం, ఎమ్మెల్యే సీతక్క నిలోఫర్‌ ఆస్పత్రిలో చిన్నారిని చూసేందుకు వెళ్లడం, వెంటనే నిందితులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.   

రంగంలోకి రాచకొండ సీపీ
ఐదు రోజులుగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నా ఫలితం లేకపోవడంతో శుక్రవారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలు దాదాపు 600 మంది పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి దమ్మాయిగూడ ప్రగతినగర్‌తో పాటు సమీప అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆయా కాలనీల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. జవహర్‌నగర్‌ సీఐ భిక్షపతిరావు, కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ల నేతృత్వంలో విస్తృతంగా విచారణ చేపట్టారు.  

మరో బాలిక కిడ్నాప్‌నకు యత్నం..
వందలాది మంది పోలీసులు శుక్రవారం గాలిస్తున్న క్రమంలో ప్రగతినగర్‌లో ఎరుపు రంగు టీషర్టు.. నల్లరంగు మాస్క్‌ ధరించిన ఓ అనుమానిత వ్యక్తి అక్కడే ఉన్న కిరాణ దుకాణంలో సిగరెట్‌ కొనుగోలు చేశాడు. అక్కడే ఆడుకుంటున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాలిక తల్లి వెంటనే అప్రమత్తమవ్వడంతో అనుమానిత వ్యక్తిని నిలదీసింది. అతని సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో ఆమె దుండగుడిని వెంబడించింది. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కీసర పోలీస్‌స్టేషన్‌ పరిసర ప్రాంతంలో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు