డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు.. 24 గంటల్లోనే పోలీసులకు చిక్కాడు

22 Aug, 2021 01:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: జీవనోపాదిలేక ఎంబీఏ చదివిన ఓ డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు. తను నివసించే ప్రాంతంలోనే చిన్న పిల్లలకు డ్యాన్స్‌ నేర్పుతూ జీవనం సాగించేవాడు. అయితే కొంత కాలంగా కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో అతను తప్పుడు దారిలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ పని అతనికి అలవాటు లేకపోవడంతో తప్పు చేసిన 24 గంటల్లోనే పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సార్ నగర్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లికి చెందిన డి. సుచరిత అనే యువతి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె మధురా నగర్‌ కాలనీలోని ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. అయితే గురువారం కూడా ఆమె రోజు మాదిరిగానే ఆఫీస్‌కు బయలుదేరింది.

ఈ క్రమంలోనే సుచరిత మధురానగర్‌ మెట్రో స్టేషన్ వద్ద లిఫ్ట్ కోసం ఎదురు చూడసాగింది. ఇక అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ యువకుడు సుచరిత మెడలోని రూ. 45 వేలు విలువ చేసే బంగారు గొలుసును దొంగిలించాడు. దీనితో బాధితురాలు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జరిగిన ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. నిందితుడిని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన చింత వినోద్‌(27)గా  గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడు వినోద్‌ను పోలీసులు దొంగతనం జరిగిన 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేకనే గొలుసు చోరీకి పాల్పడ్డారని, చోరికి పాల్పడటం ఇదే తొలిసారని  పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు