130 మంది దారుణ హత్య.. జైలులో మృతి చెందిన ‘డేటింగ్‌ గేమ్‌ కిల్లర్‌’

26 Jul, 2021 13:19 IST|Sakshi

వాషింగ్టన్‌/కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలో ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న.. "డేటింగ్ గేమ్ కిల్లర్" గా ప్రసిద్ది చెందిన ఓ హంతకుడు శనివారం మరణించినట్లు జైలు అధికారులు తెలిపారు. రోడ్నీ జేమ్స్ అల్కల (77) కాలిఫోర్నియాలోని శాన్ జోక్విన్ వ్యాలీలోని ఆసుపత్రిలో సహజ కారణాలతో మరణించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. 1977-1979 మధ్య కాలంలో కాలీఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అల్కల హత్య చేసిన ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉండటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక అల్కల అమెరికా వ్యాప్తంగా దాదాపు 130 మందిని హత్య చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

2013లో న్యూయార్క్‌లో మరో ఇద్దరిని నరహత్య చేసినందుకు గాను అల్కలాకు అదనంగా మరో 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. 1977 మృతుల్లో వ్యోమింగ్‌ ప్రాంతంలో లభించిన ఓ 28 ఏళ్ల మహిళ మృతదేహానికి సంబంధించిన కేసులో డీఎన్‌ఏ ఆధారంగా అల్కలా ప్రమేయం వెలుగు చూడటంతో అతడికి 2016లో మరోసారి శిక్ష విధించారు. ఆరు నెలల గర్భవతి హత్య కేసులో అల్కలపై ఇంకా విచారణ కొనసాగుతుందని జడ్జి వెల్లడించారు. 

ఉరి శిక్ష విధించినప్పటికి అల్కల మెడికల్‌ సంరక్షణ నిమిత్తం జైలులో కాక అతడి నివాసంలోనే ఎక్కువ కాలం ఉన్నాడు. గావిన్ న్యూసోమ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఉరిశిక్షపై తాత్కాలిక నిషేధం విధించారు. అధికారులు.. అల్కల తాను హత్య చేసిన మహిళల చెవిపోగులను ట్రోఫీలుగా తీసుకునేవాడని తెలిపారు. గతంలో అల్కల ధరించిన బంగారు చెవి రింగులు తన కుమార్తె రాబిన్‌ సామ్సోకు చెందినవని ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన మహిళ చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కానీ అల్కలా మాత్రం చెవిపోగులు తనవేనని.. వాటిని 1978 లో తాను ధరించినట్లు ‘ది డేటింగ్ గేమ్‌’ టీవీ షోలో కనిపించిన ఒక క్లిప్‌ని చూపించాడు. సామ్సో చనిపోవడానికి దాదాపు ఒక సంవత్సరం ముందే తాను ఈ బంగారు చెవి పోగులను ధరించానని అల్కలా కోర్టుకు తెలిపాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. 

దర్యాప్తుదారులు ఒక బాధితురాలి డీఎన్‌ఏ.. అల్కలా దగ్గర ఉన్న గులాబీ రంగు చెవి పోగులో గుర్తించడమే కాక.. సామ్సో శరీరంలో అల్కలా డీఎన్‌ఏ గుర్తించారు. ఈ కేసులో అతడికి రెండు సార్లు మరణశిక్ష విధించారు. కాని రెండు నేరారోపణలు తారుమారు చేయబడ్డాయి. రెండు దశాబ్దాల తరువాత, కొత్త డీఎన్‌ఏ, ఇతర ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా, నలుగురు మహిళల హత్యలకు సంబంధించి అల్కలాపై అభియోగాలు మోపారు. తీర్పు తరువాత, అధికారులు అల్కాలా ఆధీనంలో ఉన్న యువతులు, బాలికల కి చెందిన100 కి పైగా ఫోటోలను విడుదల చేశారు. 
 

మరిన్ని వార్తలు