ఖాజాగూడలో హత్య.. జిన్నారంలో కాల్చివేత 

10 Jul, 2022 02:01 IST|Sakshi
వివరాలను వెల్లడిస్తున్న మాదాపూర్‌ డీసీపీ  శిల్పవల్లి, కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్‌ తదితరులు 

తన అంతస్తుకు తగ్గట్లుగా లేడని యువతి తండ్రి ఘాతుకం  

అల్లుడి హత్యకు సుపారీ 

నారాయణరెడ్డి హత్య కేసు వివరాలు వెల్లడించిన డీసీపీ 

గచ్చిబౌలి: తమ అంతస్తుకు తగ్గట్లుగా ఆర్థికంగా లేడని కూతురు ప్రేమ వివాహన్ని జీర్ణించుకోలేక ఓ తండ్రి సుపారీ ఇచ్చి అల్లుడిని హత్య చేశాడని మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ వివాహం చేసుకున్న నారాయణరెడ్డి హత్య కేసు వివరాలను ఆమె వెల్లడించారు.

పొదల కొండపల్లి గ్రామం, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లాకు చెందిన శనివారపు మెంకట నారాయణరెడ్డి(25) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్నాడు. తన స్వగ్రామానికి చెందిన రవళిని సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకొని ఢిల్లీలో ఉంటున్నారు. రవళిని పంపిస్తే పెద్దల సమక్షంలో వివాహం జరిపిస్తామని రవళి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి నమ్మించి రప్పించారు.

రవళిని ఇంటి వద్ద ఉంచుకొని వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వెంకట నారాయణరెడ్డి తనతో భార్య కలిసి ఉన్న ఫొటోలను బందువులకు, తెలిసిన వారికి చూపించి పెళ్లి కాకుండా అడ్డుకుంటున్నాడు. ఈ క్రమంలో ద్వేషం పెంచుకున్న రవళి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి తన కూతురును ప్రేమ వివాహం చేసుకున్న వెంకట నారాయణరెడ్డిని అడ్డుతొలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

తన బందువైన చైతన్యపురిలో నివాసం ఉంటూ ఐస్‌క్రీం పార్లర్‌ నిర్వహించే గాజులపల్లి శ్రీనివాస్‌రెడ్డి(20)కి  రూ.4.5 లక్షలకు సుపారీ ఇచ్చాడు. అడ్వాన్సుగా రూ.50 వేలు ఇవ్వగా శ్రీనివాస్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ కమలపాటి కాశి(20), షేక్‌ ఆషిక్‌(20)లు కలిసి నూజివీడు వెళ్లి కారు అద్దెకు తీసుకున్నారు. తిరిగి కారులో షేక్‌పేటకు వచ్చి లాడ్జిలో అద్దెకు ఉన్నారు. జూన్‌ 26న కేపీహెచ్‌బీలోని రెడ్‌ చిల్లీ రెస్టారెంట్‌కు వెంకట నారాయణరెడ్డిని రప్పించారు.

కూల్‌డ్రింక్స్‌లో కొద్ది మోతాదులో మత్తు బిల్లలు కలిపి ఇచ్చారు. కొద్ది సేపటికే వెంకట నారాయణరెడ్డి తనకు పని ఉందని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. జూన్‌ 27న పార్టీ జరుపుకుందామని రాయదుర్గం రావాల్సిందిగా పిలిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ఖాజాగూడ చెరువు వద్ద కారులో ముందు సీట్లో కూర్చున్న వెంకటనారాయణ రెడ్డి మెడకు టవల్, చార్జర్‌ కేబుల్‌ బిగించి హతమార్చారు.

చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం సమీపంలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో బాటిల్‌లో పెట్రోల్‌ తీసుకొచ్చారు. అక్కడి నుంచి జిన్నారం అటవీ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని కాల్చి వేశారు. అక్కడి నుంచి కర్నూల్‌కు వెళ్లాడు. తన బావమరిది వెంకట నారాయణ రెడ్డి కనిపించడం లేదని, సెల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ ఉందని జూన్‌ 30న కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

విచారణ చేపట్టి నిందితుడు కాశిని అరెస్ట్‌ చేశారు. కాశి అరెస్ట్‌ అయిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, అషిక్‌లు కర్నూల్‌కు పారిపోయి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు అస్వస్థతకు గురికావడం గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌ చేశామని, పరారీలో ఉన్న రవళి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి రూ.7,160, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం
చేసుకున్నారు.

మరిన్ని వార్తలు