కరోనా కాటుకు బలి.. తీరిగ్గా 15 నెలల తర్వాత సమాచారం.. తీరని క్షోభ

30 Nov, 2021 07:29 IST|Sakshi
ఈఎస్‌ఐ నిర్లక్ష్యంతో కుటుంబాలకు శోకం  

మార్చురీలో మగ్గిన ఇద్దరి మృతదేహాలు

సాక్షి, యశవంతపుర: బెంగళూరులోని రాజాజీనగర ఈఎస్‌­ఐ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం రెండు కుటుంబాలకు తీవ్ర ఇబ్బంది తెచ్చిపెట్టింది. కరోనాతో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను తీరిగ్గా 15 నెలల తరువాత వారి కుటుంబాలు తీసుకెళ్లాలని సమాచారం ఇచ్చారు.  

వివరాలు.. చామరాజపేటకు చెందిన మహిళ  (40), కేపీ అగ్రహారకు చెందిన వ్యక్తి (35)లు 2020 జూలైలో కరోనాతో ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజులకే మరణించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కొత్తగా మార్చురీని నిర్మించి, పాత మార్చురీని ఉపయోగించడం మానేశారు. పై ఇద్దరి మృతదేహాలు పాత మార్చురీలో ఉన్నట్లు సిబ్బంది ఇటీవల గుర్తించి వారి బంధువులకు తీసుకెళ్లాలని సమాచారం పంపారు. కానీ బీబీఎంపీ రికార్డుల్లో అప్పట్లోనే వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించినట్లు, అంత్యక్రియలు పూర్తయి డెత్‌ సర్టిఫికెట్‌ జారీచేసినట్లు ఉంది. ఇప్పుడీ మానసిక క్షోభ ఏమిటని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.  

చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి  
ఈ అమానుషంపై విచారణ చేయాలని మాజీ మంత్రి సురేశ్‌కుమార్‌ కార్మిక శాఖ మంత్రి శివరామ్‌ హెబ్బార్‌ను డిమాండ్‌ చేశారు. నిర్లక్యం వహించిన బీబీఎంపీ, ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు