వెంటాడిన అప్పులు...దారి తప్పిన టెక్కీ చివరికి...

25 Jul, 2022 07:44 IST|Sakshi

బనశంకరి: ఐటీ ఉద్యోగం, దండిగా జీతం, కానీ షేర్‌ మార్కెట్‌లో ప్రవేశించి నష్టపోయాడు. చివరకు హత్య చేయడానికీ వెనుకాడలేదు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో తలెత్తిన నష్టాలనుంచి గట్టెక్కడానికి  ఇంటి యజమానురాలిని హత్యచేసి బంగారు నగలను దోచుకెళ్లిన టెక్కీని ఆదివారం బెంగళూరులోని చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులు అరెస్ట్‌చేశారు. దక్షిణ విభాగ డీసీపీ కృష్ణకాంత్‌  విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన వినాయకనగర మూడో క్రాస్‌లోని ఇంట్లో యశోదమ్మ (75) అనే వృద్ధురాలు హత్యకు గురైంది. విచారించిన పోలీసులు జై కిషన్‌ అనే టెక్కీని అరెస్టు చేశారు.  

ముంచేసిన ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ దందా  
జైకిషన్‌ యశోదమ్మ ఇంట్లో పై అంతస్తులో బాడుగకు ఉండేవాడు. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగి కాగా షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేసేవాడు. ఇటీవల తీవ్ర నష్టాలు రావడంతో చాలావరకు అప్పులు చేశాడు. యశోదమ్మ వద్ద కూడా  రూ.6 లక్షలు వరకు అప్పు తీసుకున్నాడు. అప్పులవారి బాధలు అధికం కావడంతో యశోదమ్మ వద్ద ఉన్న బంగారు నగలను కొట్టేయడానికి పథకం పన్నాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి యశోదమ్మ ఇంట్లోకి చొరబడిన జైకిషన్‌ చాకుతో ఆమెను హత్య చేసి నగలు దోచుకుని వెళ్లిపోయాడు. అద్దెకు ఉంటున్న వ్యక్తులు మృతురాలి కుమారుడు రాజుకు  సమాచారం అందించారు. అతడు చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

60 కత్తిపోట్లు
పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలంలో ఎలాంటి క్లూ దొరకలేదు. ఆరా తీయగా గతంలో యశోదమ్మతో టెక్కీ జైకిషన్‌ గొడవపడినట్లు తెలిసింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 60 సార్లు కత్తితో పొడిచి చంపడం గమనార్హం. అయినా ఏమీ తెలియనట్లు నటించాడు. వృద్దురాలి అంత్యక్రియల్లో కూడా పాల్గొని పోలీసులకు పలు విషయాలు చెప్పాడు. దీంతో పోలీసులకు ఇతడిపై అనుమానం రాలేదు. కాగా అతడు దోచుకున్న నగలను కుదువ దుకాణంలో పెట్టి నగదు తీసుకున్నాడు. అప్పులు తీర్చడానికే హత్యచేసినట్లు చెప్పాడు. కేసు విచారణలో ఉందని డీసీపీ తెలిపారు. 

(చదవండి:  రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టిన కారు)

మరిన్ని వార్తలు