వేర్వేరు కుటుంబాలకు చెందిన ఆరుగురు బలవన్మరణం

7 Dec, 2021 09:12 IST|Sakshi
తంజావూరులో ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం

సాక్షి, చెన్నై(తమిళనాడు): అప్పుల భారంతో వేర్వేరు చోట్ల రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం వెలుగు చూసిన ఈ ఘటనల వివరాలు... తంజావూరు జిల్లా రెడ్డియార్‌ పాళయానికి చెందిన రాజ (38) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. భార్య కనకదుర్గా(33), కుమారుడు శ్రీవత్సన్‌ (11) ఉన్నారు.

రెండేళ్లుగా వ్యాపారం దెబ్బతినడంతో అప్పులు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి కుమారుడిని హతమార్చి, దంపతులు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

రాణిపేటలో మరో కుటుంబం 
రాణిపేట జిల్లా కావేరిపాక్కం సుబ్బమ్మాల్‌ మొదలియార్‌వీధికి చెందిన రామలింగం(66) ఆరోగ్య శాఖలో స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఓ ప్రైవేటు కళాశాలలో పార్ట్‌టైం తమిళ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భార్య అనురాధా(57), కుమారులు విష్ణు(25), భరత్‌(22) ఉన్నారు. విష్ణుకు వివాహం కావడంతో బెంగళూరులో ఉంటున్నాడు. భరత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాడు.

రామలింగం చేపల చెరువు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం.. ఇచ్చిన వారి నుంచి వేధింపులు అధికం కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆదివారం రాత్రి రామలింగం, అనురాధా, భరత్‌ వేర్వేరు గదుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు