అనూష హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌ 

27 Feb, 2021 08:10 IST|Sakshi

48 గంటల్లో చార్జిషీట్‌ దాఖలు 

నగరంపాలెం (గుంటూరు): గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని కోట అనూష హత్య కేసులో నిందితుడు విష్ణువర్థన్‌రెడ్డిని గుంటూరు రూరల్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి, హత్య కేసు వివరాలను ఎస్పీ విశాల్‌ గున్ని వెల్లడించారు. బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన మేడం విష్ణువర్ధన్‌రెడ్డి నరసరావుపేటలోని డిగ్రీ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న అనూషను ప్రేమించాలంటూ వేధించేవాడు.

ఈ క్రమంలో అనూష అదే కళాశాలలో చదివే మరో యువకుడితో చనువుగా ఉండటాన్ని గమనించి, నమ్మకంగా బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసి.. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలి తల్లి వనజాక్షి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం అతడిని అరెస్ట్‌ చేసినట్టు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని వెల్లడించారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే కేసు నమోదు చేయడంతో పాటు 48 గంటల్లో చార్జిషీట్‌ దాఖలు చేశారు. నిందితుడికి త్వరిత గతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో ఈ కేసును మోడల్‌గా పరిగణిస్తామని ఎస్పీ వెల్లడించారు.
చదవండి:
అనూష కేసు: రెండేళ్లు గా వేధిస్తున్నాడు! 
నిండు గర్భిణిని కాళ్లతో తొక్కి చంపేశారు..

మరిన్ని వార్తలు