పథకం ప్రకారమే హత్య

25 Feb, 2021 10:46 IST|Sakshi

వివాహేతర సంబంధం వల్లే ఇలా..

పిఠాపురంలో హత్య కేసును

ఛేదించిన పోలీసులు

నిందితుడి అరెస్టు 

పిఠాపురం(తూర్పుగోదావరి): వివాహేతర సంబంధం ఒకరిని జైలు పాలు చేస్తే.. మరో రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ముగ్గురు పిల్లలను అనాథలను చేసింది. శారీరక సుఖం కోసం కట్టుకున్న భర్తనే హతమార్చడానికి పథకం వేస్తే ఆ పథకమే ఆమె చావుకు కారణమైంది.  పిఠాపురంలో ఈనెల 8వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసిన కాకినాడ డీఎస్పీ భీమారావు బుధవారం పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో కేసు వివరాలను మీడియాకు వివరించారు.

స్థానిక కోటవారి వీధిలో రెడ్డెం శ్రీనివాసు తన రెండో భార్య స్వరూపారాణి, ముగ్గురు పిల్లలతో కలసి కాపురం ఉంటున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో అదే వీధిలో ఇంటి నిర్మాణ పనుల కోసం వచ్చిన కోరుకొండ మండలం కనుపూరుకు చెందిన రెడ్డి వీరబాబుతో స్వరూపారాణి అక్రమ సంబంధం పెట్టుకుంది. అప్పటి నుంచి ఇద్దరూ అర్ధరాత్రి మృతుడు శ్రీనివాస్‌ ఇంటిలో కలుసుకునే వారు. ఈ నేపద్యంలో వీరి వివాహేతర సంబంధం తెలుసుకున్న శ్రీనివాస్‌ పలు మార్లు మందలించగా, ఆమె తన భర్తను చంపి అడ్డు తొలగించాలని నిందితుడు వీరబాబుతో కలసి పథకం వేసింది. ఈనెల ఏడో తేదీ రాత్రి తన మోటారు సైకిల్‌పై కనుపూరు నుంచి వీరబాబు తన వెంట బలమైన చెక్కను తీసుకువచ్చాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మృతుడి భార్య సూచన మేరకు ఇంట్లోకి ప్రవేశించాడు. మృతుడు శ్రీనివాస్‌ ఒక గదిలో మడతమంచంపై నిద్రిస్తుండగా నిందితుడు తన వెంట తెచ్చుకున్న బలమైన చెక్కతో అతడి తలపై బలంగా మోదాడు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన శ్రీనివాస్‌ నాడి చూసి ఎలాంటి పరిస్థితుల్లో తన భర్త బతకకూడదని స్వరూపారాణి చెప్పడంతో నిందితుడు చెక్కతో మరింత బలంగా కొట్టాడు. మృతుడు తల పూర్తి గా ఛిద్రమైంది.

అనంతరం తాము ముందు వేసుకున్న పథకం ప్రకారం ఎవరో బయటి వ్యక్తులు వచ్చి హత్య చేసినట్టుగా చిత్రీకరించే పనిలో భాగంగా చనిపోయిన శ్రీనివాస్‌ను తాళ్లతో కట్టి గుట్టుచప్పుడు కాకుండా రక్తపు మరకలు కడిగేసుకుని, దుస్తులు మార్చుకుని తన మోటారు సైకిల్‌పై నిందితుడు తిరిగి వెళ్లిపోయాడు. అనంతరం ఉదయం ఎవరికీ అనుమానం రాకుండా తాను లేచి చూసేసరికి తన భర్త రక్తపు మడుగులో ఉన్నాడని భార్య స్వరూపారాణి కట్టుకథ అల్లి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.

మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పిఠాపురం సీఐ పి. రామచంద్రరావు, ఎస్సై శంకర్రావు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికపరమైన ఆధారాలతో నిందితులను గుర్తించగా, విషయం బయటకు తెలిసిపోతుందని, తనను పట్టుకుంటే అంతా నువ్వే చేయించావని చెబుతానని నిందితుడు వీరబాబు స్వరూపారాణిని ఫోన్‌లో బెదిరించడంతో ఎక్కడ తన బండారం బయటపడుతుందోననే భయంతో ఈనెల 12న తన ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె మృతి చెందింది. దీంతో దర్యాప్తు నిర్వహించిన పోలీసులు నేర స్థలానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరా పుటేజీలతో పక్కా ఆధారాలతో నిందితుడిని ఈనెల 23న పిఠాపురంలో అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై హత్య కేసుతో పాటు, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసును నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ రామంద్రరావు, ఎస్సై శంకర్రావు ఇతర పోలీసు సిబ్బందిని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు, జిల్లా ఎస్పీ అద్మాన్‌ నయీం అస్మీలు ప్రత్యేకంగా అభినందించినట్టు ఆయన తెలిపారు.
చదవండి:
నచ్చిన వారికి కొలువులు.. అడిగినంత వేతనం
పనులన్నీ మానేసి.. గ్రామస్తులంతా కదిలొచ్చి

మరిన్ని వార్తలు