హత్య కేసును ఛేదించిన పోలీసులు 

11 Mar, 2021 11:19 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ హరనాథ్‌రెడ్డి, సీఐ ఖాజావలీ, ఎస్సై ఇంద్రసేనారెడ్డి, స్వాధీనం ఆభరణాలు   

11 సవర్ల బంగార ఆభరణాలు స్వాదీనం 

తోటపల్లిగూడూరు(నెల్లూరు జిల్లా): మండలంలోని నరుకూరు వృద్ధాశ్రమంలో ఓ వృద్ధురాలి హత్య కేసులో నిందితులను అరెస్ట్‌ చేసి, వారి నుంచి 11 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరనాథరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన అమర్తలూరు రత్నమ్మ(74) రెండేళ్లగా మండలంలోని శ్రీ వాసవీ ఆర్యవైశ్య వృద్ధాశ్రమంలో ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన రత్నమ్మ కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై అదే నెల 22న తన మేనత్త కనిపించడం లేదంటూ రత్నమ్మ మేనల్లుడు పోబోలు వెంకటేశ్వర్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే రత్నమ్మకు వరసకు కోడలు అయిన పడారుపల్లికి చెందిన మాకం సుజాతపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగుచూశాయన్నారు.

రత్నమ్మ ఒంటిపై ఉన్న బంగారంపై కాజేసే దురుద్దేశంతో ఆమెను అంతం చేసేందుకు సుజాత పన్నాగం పన్నిందన్నారు. సుజాత తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సుందరయ్య కాలనీకి చెందిన గెరిక సైదులు, అతని స్నేహితుడు పగడాల సాయి సహాయంతో రత్నమ్మ హత్యకు కుట్ర చేసిందన్నారు. సుజాత ఫిబ్రవరి 16న నెల్లూరుకు వచ్చిన రత్నమ్మను నమ్మకంగా సుందరయ్య కాలనీలో సైదులు ఇంటికి రప్పించిందన్నారు. ముగ్గురు కలిసి రత్నమ్మను తాడుతో గొంతు నలిమి చంపి ఆమె ఒంటిపై ఉన్న 11 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకుని మృతదేహాన్ని చెన్నై–కోల్‌కతా రహదారిలో సర్వేపల్లి కాలువలో పారేశారన్నారు. అయితే వారం రోజులుగా రత్నమ్మ మృతదేహం కోసం గాలించినా జాడ తెలియలేదన్నారు. బుధవారం ఈ హత్య కేసులో నిందితులు మాకం సుజాతతో పాటు గెరిక సైదులు, పగడాల సాయి నుంచి ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు.  ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు. ఈ హత్య కేసును ఛేదించడంలో కృషి చేసిన స్టేషన్‌ సిబ్బందికి రివార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం సీఐ ఖాజావలి, స్థానిక ఎస్సై ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
నగ్నంగా బైక్‌పై హల్‌చల్‌ : పోలీసుల వేట!    
ఇంటర్‌ ఫెయిల్‌.. భద్రమ్‌ సినిమా చూసి దారుణం 

మరిన్ని వార్తలు