పట్టుబడిన కిరాతకులు 

7 Feb, 2022 03:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రెండు జంట హత్య కేసుల్లో నిందితులు  

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో రెండుచోట్ల జరిగిన వేర్వేరు జంట హత్యల కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  ఎస్పీ మలికాగర్గ్‌ ఆదివారం  మీడియాకు వివరాలు వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌ 3న రాత్రి టంగుటూరుకు చెందిన బంగారం వ్యాపారి జలదంకి రవి భార్య శ్రీదేవి(43), ఆమె కుమార్తె వెంకట లేఖన (19)లు దారుణహత్యకు గురయ్యారు. పోలీసులు నిఘా పెట్టి టంగుటూరు ఎస్‌.జంక్షన్‌ వద్ద ఆదివారం అక్కల శివకోటయ్య, కంకిపాటి నరేష్‌లను అరెస్ట్‌ చేశారు. గతంలో సంచలనం సృష్టించిన చీమకుర్తి డబుల్‌ మర్డర్‌ కేసు కూడా వీరే చేసినట్లు విచారణలో తేలింది.  

జైలులో పరిచయంతో.. 
కందుకూరు సాయినగర్‌కు చెందిన అక్కల శివకోటయ్య, జరుగుమల్లి మండలం దావగూడూరుకు చెందిన కంకిపాటి నరేష్‌లకు గతంలో కేసులకు సంబంధించి జైలులో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక  నరేష్‌ ఇటీవల టంగుటూరులో మెకానిక్‌ షాపు తెరిచాడు. తన షాపునకు ఎదురుగా ఉన్న రోడ్డులో జలదంకి రంగాకు చెందిన బంగారం దుకాణంలో గతేడాది జూన్‌లో  బంగారం ఎత్తుకెళ్లారు. అనంతరం జలదంకి రవికిషోర్‌ ఇంట్లోకి వెళ్లి రంగా కుమార్తె లేఖన, భార్య శ్రీదేవిలను హత్య చేసి బంగారు నగలు దోచుకెళ్లారని  దర్యాప్తులో తేలింది.

చీమకుర్తిలో 2018 సెప్టెంబర్‌ 18న జరిగిన జంట హత్యల కేసులోనూ అక్కల శివకోటయ్య నిందితుడిగా గుర్తించారు. వెంకటసుబ్బారావుకు చెందిన ఇంట్లోకి ప్రవేశించి ఆయనను ఇనుపరాడ్డుతో హతమార్చాడు.   సుబ్బారావు భార్య రాజ్యలక్ష్మిని కూడా ఇనుప రాడ్‌తో హత్యచేసి బంగారంతో ఉడాయించినట్లు తేలింది. విచారణలో నిందితులు మరో మూడు నేరాలు చేసినట్లు తేలింది. మొత్తం రూ.53.48 లక్షల సొత్తు చోరీ కాగా.. నిందితుల నుంచి రూ.32.48 లక్షల సొత్తును పోలీసులు సీజ్‌ చేశారు. 612 గ్రాముల బంగారం, ఒక ఫోర్డ్‌కారు, రెండు మోటార్‌ సైకిళ్లను సీజ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు