విహారయాత్రలో విషాదం

4 Apr, 2021 21:31 IST|Sakshi

నెల్లిమర్ల రూరల్‌/చీపురుపల్లిరూరల్‌(గరివిడి): విహారయాత్రకు బయలుదేరిన విద్యారి్థనిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. నెల్లిమర్ల మండలం పెదతరిమి వద్ద శనివారం జరిగిన ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గరివిడి మండలం తాటిగూడకు చెందిన యడ్ల సుప్రియ(21) ఎస్‌డీఎస్‌ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. ఇటీవలే పరీక్షలు పూర్తి కావడంతో తన స్నేహితులు కొంత మంది పూసపాటిరేగ మండలం గోవిందపురం బీచ్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అందరూ ఇంటి వద్ద కళాశాలకు వెళ్లి వస్తామని చెప్పి ద్విచక్రవాహనాలపై గోవిందపురం బయలుదేరారు. సుప్రియ తన స్నేహితుడు రెడ్డి రవితేజతో పాటు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నెల్లిమర్ల మండలం పినతరిమి గ్రామం వద్దకు చేరుకునేసరికి అక్కడున్న ప్రమాదకర మలుపు వద్ద వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది.

పక్కనే పెద్దపెద్ద రాళ్లు ఉండడంతో సుప్రియ తలకు, మొఖానికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై దామోదరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. యువతితో పాటు ప్రయాణించిన యువకుడు రెడ్డి రవితేజపై మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రియ మృతికి నువ్వే కారణమని, విహారయాత్రకు ఎందుకు తీసుకెళ్లావంటూ దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

తాటిగూడలో విషాదచాయలు 
విద్యార్థిని మృతితో తాటిగూడ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. విద్యార్థిని తండ్రి వెంకటేశ్వర్లు తాపీమేస్త్రీ కాగా తల్లి గృహిణి. వీరికి కుమార్తె, కొడుకు. ఇద్దరి సంతానంలో కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు