డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య

25 Feb, 2021 03:26 IST|Sakshi
మృతురాలు అనూష (ఫైల్‌), నిందితుడు విష్ణువర్ధన్‌

తోటి విద్యార్థి ఘాతుకం

అనుమానంతో గొంతు నులిమి హత్య.. పోలీసులకు లొంగిపోయిన ఉన్మాది

నిందితుడిని శిక్షించాలంటూ విద్యార్థుల ఆందోళన 

దుర్ఘటనపై ఆరాతీసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

నిందితునిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశం

బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం 

చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో ప్రేమ పెడదారి పట్టింది. ప్రేమించిన తోటి విద్యార్థినిపై అనుమానం పెనుభూతమైంది. విచక్షణ పోయింది. రాక్షసత్వం ఆవహించింది. ఆమెను గొంతునులిమి చంపేశాడు. గుంటూరు జిల్లాలో బుధవారం ఈ దారుణం జరిగింది. డిగ్రీ చదువుతున్న యువకుడు తోటి విద్యార్థినిని దారుణంగా హత్యచేశాడు. 

నరసరావుపేట రూరల్‌: గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం డిగ్రీ విద్యార్థిని అనూష (19) హత్యకు గురైంది. సహ విద్యార్థి మేడా విష్ణువర్ధన్‌రెడ్డి ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని కాలువలో పడేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటనను జీర్ణించుకోలేని అనూష కుటుంబసభ్యులు, బంధువులు, విద్యార్థులు మృతదేహంతో సహా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రాత్రి పదిగంటల సమయంలో విద్యార్థులు ఆందోళన విరమించారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన కోట ప్రభాకరరావు, వనజ దంపతుల కుమార్తె అనూష నరసరావుపేటలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. రోజూ కళాశాల బస్సులో ఇంటిదగ్గర నుంచి వచ్చి వెళుతోంది. బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మేడా కోటిరెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఆమెతోపాటే చదువుతున్నాడు. కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. వారిమధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. 

పథకం ప్రకారమే..
రోజూలాగే బుధవారం కళాశాల బస్సులో నరసరావుపేట వచ్చిన అనూష పాలకేంద్రం సెంటర్‌ వద్ద దిగింది. కాలేజీకి వెళుతున్న ఆమెను విష్ణువర్ధన్‌రెడ్డి ఆటోలో రావిపాడు వైపు తీసుకెళ్లాడు. మెయిన్‌రోడ్డుపై ఆటో దిగి గోవిందపురం మైనర్‌ కాలువ వైపు నడిచి వెళుతుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే అనుమానంతో రగిలిపోతున్న విష్ణువర్ధన్‌రెడ్డి ఆవేశంతో అనూష గొంతు పట్టుకున్నాడు. పైశాచికంగా గొంతుపట్టుకున్న అతడి చేతుల్లో ఆమె విలవిల్లాడుతూ ప్రాణాలొదిలింది. ఆమె మృతదేహాన్ని కాలువలోని గుర్రపుడెక్క మధ్య పడేసిన విష్ణువర్ధన్‌రెడ్డి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అతడి నుంచి వివరాలు సేకరించిన రూరల్‌ సీఐ వై.అచ్చయ్య, ఎస్‌ఐలు రోశయ్య, బాలకృష్ణ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. 

విద్యార్థుల ఆందోళన
నిన్నటివరకు తమ మధ్య తిరిగిన అనూష దారుణ హత్యను తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో వారు ఆస్పత్రి నుంచి అనూష మృతదేహాన్ని పల్నాడు బస్టాండ్‌ సెంటర్‌కు తీసుకొచ్చి.. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రాస్తారోకోకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారి ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. నరసరావుపేట సబ్‌కలెక్టర్‌ శ్రీవాసు నుపూర్‌ అజయ్‌కుమార్, డీఎస్పీ విజయకుమార్‌ ఆందోళన చేస్తున్నవారితో చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాలను వారికి తెలిపారు. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాత్రి పదిగంటల సమయంలో వారు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నిందితులపై దిశ చట్టం కింద కేసు నమోదు
అధికారులను ఆదేశించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా నరసరావుపేటలో కళాశాల విద్యార్థిని అనూష హత్యకు గురైన సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్న ముఖ్యమంత్రి..  అనూష కుటుంబానికి తక్షణమే రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలిచి వారికి భరోసా ఇవ్వాలని సూచించారు. బాధ్యులపై దిశ చట్టం కింద వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని, విచారణ వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నేరస్తులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు