అంత్యక్రియలకు ఏర్పాట్లు.. మరోసారి కన్నీళ్లే

15 Oct, 2020 21:27 IST|Sakshi
గీతాంజలి ఫైల్‌

సాక్షి, జయశంకర్‌ జిల్లా: అనారోగ్యానికి గురై మరణించిందనుకున్న కూతురు మూలుగు శబ్దం ఆఖరి నిమిషంలో ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఆశలు రేపింది. అయితే తమ బిడ్డ బతికేఉందని సంతోషపడేలోపే మళ్లీ విధి వాళ్లను వెక్కిరించింది. కాటి నుంచి ఆస్పత్రికి తరలించిన కూతురు మరణించందని వైద్యులు ధ్రువీకరించడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. మహదేవపూర్‌ మండలం కుదరుపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని మెండ గీతాంజలి(20) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జ్వరం రావడంతో ఆమెను కొద్ది రోజులు ప్రేవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.(చదవండి: దివ్య తేజస్విని హత్య కేసులో కీలక మలుపు)

డిశ్చార్జ్‌ అయిన అనంతరం ఇంటి వద్దే ఉంటూ మందులు వాడుతోంది. అయితే బుధవారం జ్వరం మరీ తీవ్రం కావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. అంతలోనే చలనం లేకుండా పడిపోవడంతో ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. గ్రామస్తులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో దింపుడుకల్లం వద్ద శవాన్ని దించి బంధువులు ఆమె చెవిలో పిలస్తున్న సమయంలో చిన్నగా మూలుగు వినిపించింది. దీంతో వెంటనే మళ్లీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో ఫలితం లేకుండా పోయింది. తిరిగి గ్రామానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేశారు. 

మరిన్ని వార్తలు