శ్రావణిని చంపేశారా!?

24 Jul, 2020 07:04 IST|Sakshi
పుర్రెను పరిశీలిస్తున్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీక్‌,ఘటనా స్థలంలో పడి ఉన్న పర్సు, సెల్‌ఫోన్‌

గత ఏడాది అక్టోబర్‌లో తప్పిపోయిన డిగ్రీ విద్యార్థిని 

9 నెలలుగా కొనసాగుతున్న దర్యాప్తు 

బుధవారం లభ్యమైన మానవ అవశేషాలు 

ఘటనాస్థలంలో పడి ఉన్న శ్రావణి ఐడీ, పర్సు

కదిరి అర్బన్‌: గత ఏడాది తప్పిపోయిన డిగ్రీ విద్యార్థిని శ్రావణిని హతమార్చారా? ప్రస్తుతం లభ్యమైన మానవ అవశేషాలు, పర్సు, సెల్‌ఫోన్‌ శ్రావణివేనా? తదితర ప్రశ్నలకు సమాధానం అవుననే సమాధానం వస్తోంది. తొమ్మిది నెలలుగా కొనసాగుతూ వచ్చిన పోలీసు దర్యాప్తు.. ప్రస్తుతం లభ్యమైన ఆధారాలతో వేగం పుంజుకోనుంది. వివరాల్లోకి వెళితే.. కదిరి మండలంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదువుతున్న శ్రావణి 2019, అక్టోబర్‌ నుంచి కనిపించకుండా పోయింది. కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీనిపై కుటుంబసభ్యులు పలు చోట్ల గాలించి, చివరకు కదిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెలలు గడుస్తున్నా ఈ కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు.

పట్టణ సమీపంలోనే ఆధారాలు లభ్యం 
ఈ నెల 22న స్థానిక మున్సిపల్‌ పరిధిలోని సోమేష్‌ నగర్‌ సమీపంలో శ్రావణికి సంబంధించి ఆధారాలు ఓ గొర్రెల కాపరికి కంటపడ్డాయి. అనుమానం వచ్చిన ఆ కాపరి ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ షేక్‌ లాల్‌ మహమ్మద్, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీక్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పంట పొలాల్లో పడి ఉన్న పర్సులో శ్రావణి ఐడీ కార్డు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు, చిన్న మొత్తంలో నగదు లభ్యమయ్యాయి. పర్సు పడి ఉన్న చోటుకు కొద్దిదూరంగా  ఓ పుర్రె, రెండు ఎముకలను గుర్తించారు. ఇవి శ్రావణివేనా లేక మరెవరివైనా అనేది తేలాల్సి ఉంది. లభ్యమైన ఆధారాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నట్లు సీఐ తెలిపారు. కాగా, శ్రావణిపై అత్యాచారం జరిపి హతమార్చి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు