నమస్తే పెట్టలేదని.. విద్యార్థిపై దాడి

3 Oct, 2020 10:02 IST|Sakshi
తీవ్రంగా గాయపడిన మహేష్‌కుమార్‌సింగ్‌

సాక్షి, కొత్తూరు: తమకు నమస్తే పెట్టలేదనే కోపంతో కొందరు యువకులు డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్‌ చేసి కర్రలతో తీవ్రంగా కొట్టి గాయపర్చారు. ఈ సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సీఐ భూపాల్‌ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో నివాసముండే మహేష్‌కుమార్‌సింగ్‌ శంషాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గురువారం తన స్నేహితులతో కలిసి శంషాబాద్‌ మండలం నానాజీపూర్‌లోని వాటర్‌ఫాల్స్‌ వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న కొత్తూరుకే చెందిన పల్లెల చందు, కొల్లంపల్లి మురారి, ముడావత్‌ వినోద్, శ్రీకాంత్‌ తమను చూసి కూడా నమస్తే పెట్టలేదని ఆగ్రహంతో మహేష్‌కుమార్‌తో గొడవకు దిగారు.

అనంతరం అక్కడి నుంచి మహేష్‌కుమార్‌ తన బైకుపై కొత్తూరుకు వస్తుండగా యువకులు మార్గమధ్యలో అడ్డగించి తమ బైకుపై ఎక్కించుకొని కిడ్నాప్‌ చేశారు. సుమారు రెండు గంటల పాటు మండలకేంద్రంలోని ఆయా వెంచర్లలో తిప్పుతూ కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మహేష్‌కుమార్‌ వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుని, శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నలుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మద్యం మత్తులో హత్య
శంకర్‌పల్లి: కన్న తండ్రిని కత్తితో నరికి చంపిన ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, మద్యం మత్తులో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో నివాసముంటున్న మ్యాదరి అంజయ్య(60)ను గురువారం రాత్రి అతడి కుమారుడు యాదయ్య కత్తితో తల నరికి హత్య చేశాడు. ఇది గమనించిన స్థానికులు ఇంటి బయట నుంచి తలుపులు వేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యాదయ్యను పట్టుకునేందుకు యత్నించగా కత్తితో బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆక్టోపస్, ఫైర్‌ సిబ్బంది, 50 మందికి పైగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు.

ఆక్టోపస్‌ సిబ్బంది టియర్‌ గ్యాస్‌ను ఇంట్లోకి వదలడంతో వాసన తట్టుకోలేక యాదయ్య ఇంట్లో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. అప్పటికే బయట సిద్ధంగా ఉన్న పోలీసులను తప్పించుకుని మరో ఇంటిపైకి ఎక్కాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఇంటి పక్కనే ఉన్న మరో భవనం పైనుంచి నీటిని బలంగా వదలడంతో యాదయ్య కిందపడిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని బంధించి పోలీస్‌స్టేషన్‌ తరలించారు. అనంతరం అంజయ్య మృతదేహం వద్ద వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం యాదయ్యను విచారించగా.. మద్యం మత్తులో కత్తితో తల నరికానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. యాదయ్య మానసికస్థితి బాగోలేదని తరచూ భార్య, తల్లిదండ్రులతో గొడవçప³డేవాడని చెల్లెలు సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు