ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. మృతుల సంఖ్య పెరగడానికి అదే కారణమా?

14 May, 2022 08:16 IST|Sakshi

నూఢిల్లీ: దేశ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం నుంచి 60 నుంచి 70 మందిని రక్షించామని, సుమారు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఒక ఫ్లోర్‌ను గాలించాల్సి ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

కీలక అంశాలు..

► మొదటి అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ కంపెనీ కార్యాలయంలో మంటలు చెలరేగాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ తెలిపారు

► భవనంలో అగ్ని ‍ప్రమాదం జరిగిన కాసేపటి పొగలు భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో కొంతమంది తమను తాము రక్షించుకోవడానికి కిటికీలోంచి కిందకి దూకేశారని, మరికొందరు కిందకి దిగడానికి తాళ్లను ఉపయోగించిన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కొందరికి గాయాలు కాగా మరికొందరు మృతి చెందారు.

► భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి ఎటువంటి సేఫ్టీ క్లియరెన్స్‌ లేదు. ఆ బిల్డింగ్‌ యజమాని మనీష్ లక్రాగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న కంపెనీ యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

►మంటలు చెలరేగినప్పుడు రెండవ అంతస్తులో మోటివేషన్‌ స్పీచ్‌ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమిదే కావొచ్చని అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ఈ అంతస్తులో నుంచి మృతుల సంఖ్య మరింత బయటపడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

►కేవలం ఒక మెట్లు ద్వారం మాత్రమే ఉన్నందున ప్రజలు భవనం నుంచి తప్పించుకోలేకపోయారని అగ్ని మాపక శాఖ డివిజనల్ అధికారి తెలిపారు.

►అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం 4.40 గంటలకు మంటలు చెలరేగినట్లు సమాచారం అందడంతో 24 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందకు తీవ్రంగా శ్రమించాయి.

►బాధితుల గుర్తింపు గురించి పోలీసులు ఇంకా వివరాలు పంచుకోలేదు. ఘటనలో గాయపడిని వారిని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. భవనం నుండి కనీసం 60 మందిని రక్షించారని, మరికొందరు ఇంకా లోపల చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు.

►అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. 

చదవండి: Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

మరిన్ని వార్తలు