షాకింగ్.. పోలీస్ స్టేషన్ ముడో అంతస్తు నుంచి దూకిన నిందితుడు..

6 Mar, 2023 15:05 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. రూ.14 లక్షల మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్ మూడో అంతస్తు నుంచి దూకాడు. పోలీసులు వద్దని చెప్పినా వినకుండా పైనుంచి జంప్ చేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడ్ని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు అధికారులు. చికిత్స పొందుతూ అతడు సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడి పేరు ఆనంద్ వర్మ అని పోలీసులు వెల్లడించారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.14 లక్షలు  తీసుకుని ఒకర్ని మోసం చేశాడని పేర్కొన్నారు. అయితే ఆనంద్‌వర్మపై కేసు పెట్టింది మరెవరో కాదు, ఇదే పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అజీత్ సింగ్ కావడం గమనార్హం.

ఈ కేసు ప్రాథమిక విచారణలో భాగంగా ఆనంద్‌వర్మను పోలీస్ స్టేషన్‍కు  పిలిపించారు. అయితే రూ.14లక్షలను అతడు తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో వెంటనే వదిలిపెట్టామని అజీత్ సింగ్ చెబుతున్నారు. అలాంటప్పుడు ఆనంద్ వర్మ పోలీస్‌ స్టేషన్‌లోనే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.  కాగా.. ఈ కేసు గురించి పై అధికారులకు తెలిసిందని, హెడ్‌ కానిస్టేబుల్‌ అజీత్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..

మరిన్ని వార్తలు