మైక్రోసాఫ్ట్‌పైనే రివెంజా...టెకీకి భారీ షాక్‌

25 Mar, 2021 11:52 IST|Sakshi

ఉద్యోగంనుంచి తీసేసినందుకు టెకీ దుశ్చర్య

మైక్రోసాఫ్ట్ 1200 అకౌంట్లు డిలీట్‌ 

ఇండియన్‌టెకీకి  రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్‌ మాజీ ఉద్యోగికి కాలిఫోర్నియా కోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. తనను ఉద్యోగంనుంచి తొలగించారన్న ఆక్రోశంతో మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి దీపాంశు ఖేర్‌ ప్రతీకారం తీర్చు కోవాలనుకున్నాడు. సుమారు 1200 యూజర్‌ అకౌంట్లను డిలీట్‌ చేసి పారేసి సైబర్‌ నేరానికి పాల్పడ్డాడు. దీనిపై విచారించిన అమెరికా కోర్టు దీపాంశుకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది. అలాగే మరో మూడేళ్లు అతనిపై నిరంతర పర్యవేక్షణతోపాటు, 5,67,084 డాలర్ల  (సుమారు నాలుగుకోట్ల రూపాయలు) జరిమానా కూడా విధించింది. (మైక్రోసాఫ్ట్‌ బిగ్‌ ప్లాన్స్‌ : భారీ కొనుగోలుకు సన్నాహాలు)

ఉద్యోగంలో ఉద్వాసనకు గురైన తర్వాత దీపాంశు ఆగ్రహంతో రగిలిపోయాడు. దీంతో కక్షపూరితగా కంపెనీ సర్వర్‌ను హ్యాక్‌ చేసి మరీ 1200 ఖాతాలను తొలగించాడు. సర్వర్‌లోని 1500 యూజర్‌ అకౌంట్లలో 1200 అకౌంట్లను డిలీట్‌ చేశాడు. ఆ తర్వాత కామ్‌గా ఢిల్లీకి వచ్చేశాడు. ఈ చర్య మైక్రోసాఫ్ట్‌ కంపెనీనీ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ అకౌంట్లకు సంబంధించిన ఈమెయిల్స్‌, కాంటాక్టులు, కీలక జాబితాలు, సమావేశాల తేదీలు, డాక్యుమెంట్లు, డైరీలు, వీడియో, ఆడియో కాన్ఫరెన్సుల వివరాలన్నీ గల్లంతు కావడంతో కంపెనీ బాగా నష్టపోయింది. కంపెనీని ఏకంగా  రెండు రోజుల పాటు పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. (గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఫుడ్ డెలివరీ సంస్థ)

చివరికి అతగాడు చట్టానికి దొరకక తప్పలేదు. దీనిపై విచారణ జరుగుతోందని గమనించని దీపాంశు గత జనవరి 11న మళ్లీ అమెరికాకు వెళ్లాడు. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నపోలీసులు అతనికి విమానాశ్రయంలోనే చెక్‌పెట్టారు. అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఉద్దేశపూరకంగా విధ్వంసక నేరం చేసి  ఖేర్‌ ఎంతో తెలివిగా తప్పించు కోవాలను కున్నాడని, కంపెనీ మీద ప్రతీకారంతో, పథకం ప్రకారమే సైబర్‌ నేరానికి పాల్పడ్డాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ న్యాయమూర్తి మేరిలిన్‌ హఫ్‌ వ్యాఖ్యానించారు.  ఖేర్‌ చేసిన కుట్రపూరితమైన చర్య ఫలితంగా కంపెనీ తీవ్రంగా నష్టపోయిందని అమెరికా అటార్నీ రాండీ గ్రాస్‌మన్‌  పేర్కొన్నారు. (వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోలు ధర)

కోర్టు పత్రాల ప్రకారం, ఖేర్‌ను 2017 నుండి మే 2018 వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ కార్ల్స్ బాడ్ నియమించింది.  అయితే ఖేర్ పనిపై  సంతృప్తి చెందని కంపెనీ కన్సల్టింగ్ సంస్థకు తన అసంతృప్తిని తెలియజేసింది. దీంతో  జనవరి 2018 లో, కన్సల్టింగ్ సంస్థ ఖేర్‌ను సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి తొలగించింది. చివరికి  మే 4, 2018న ఖేర్‌ను ఉద్యోగంనుంచి తొలగించింది.
 

మరిన్ని వార్తలు