భగ్గుమంటున్న దేశ రాజధాని.. కేసు క్రైం బ్రాంచ్‌కు బదిలీ

5 Aug, 2021 17:20 IST|Sakshi

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 వసంతాలు. మరి సామాన్యుల జీవితాల్లో మార్పు వచ్చిందా? బడుగు జీవుల బతుకుల్లో వెలుగు నిండిందా? ఆడ వారిపై అత్యాచారాలు, అఘాయిత్యాలు తగ్గాయా? ఓ పేదవానికి వెంటనే న్యాయం అందుతుందా? ఒకటా.. రెండా.. వందలు.. వేలు.. లక్షల ప్రశ్నలు. ఇలా లెక్కించుకుంటూ పోతే రామయాణ, మహాభారత గ్రంథాలను మించి రాయాల్సి ఉంటుంది. 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన 9 ఏళ్ల మైనర్‌ బాలికపై హత్యాచార ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీనిని పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, ప్రముఖులు ఖండిస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసును వేగంగా దర్యాప్తు చేయడానికి క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 1న నైరుతి ఢిల్లీలో తొమ్మిదేళ్ల మైనర్‌ బాలికపై దాడి చేసి సామూహిక అత్యాచారం, హత్య చేసి, రాత్రికి రాత్రే దహనం చేశారు. కాగా ఈ కేసును ఆగస్టు 4న నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీసీసీఆర్) సుమోటోగా తీసుకుంది. అంతేకాకుండా 48 గంటల్లో దీనిపై సరియైన నివేదికను సమర్పించాలని ఢిల్లీ సౌత్‌ వెస్ట్‌ డీసీపీకి ఎన్‌సీసీసీఆర్ లేఖ రాసింది. కాగా ఢిల్లీ పోలీసు కమిషనర్, రాకేశ్ ఆస్థానా ఈ కేసు బదిలీకి దిశానిర్దేశం చేశారు.

తక్షణ చర్యలు తీసుకోవాలి: అరవింద్ కేజ్రీవాల్
ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. బుధవారం ఆయన బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఇక నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఉన్నత న్యాయవాదులను నియమిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన సిగ్గుచేటు అని పేర్కొన్నాడు.  ఢిల్లీలో శాంతిభద్రతలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అన్నారు. కాగా బాధితురాలి తల్లి తల్లి స్టేట్‌మెంట్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు