లేడీ డాన్‌ అనూరాధ ఆటకట్టు 

31 Jul, 2021 19:42 IST|Sakshi

మరో కరుడు  కట్టిన నేరగాడు సందీప్ అలియాస్ కాలా జతేది అరెస్ట్‌ చేసిన పోలీసులు

రెజ్లర్‌ సుశీల్ కుమార్‌తో జతేది సంబంధాలపై పోలీసుల ఆరా

న్యూఢిల్లీ: రాజస్థాన్‌కు చెందిన లేడీ డాన్‌ అనురాధ చౌదరి ఆట కట్టించారు ఢిల్లీ పోలీసులు.  పలు మర్డర్ కేసులు, దోపిడి, కిడ్నాప్‌   ఆరోపణలున్న గ్యాంగ్‌స్టర్ అనురాధను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ శనివారం ప్రకటించింది. మరో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేదిని ఉత్తర ప్రదేశ్‌లో అరెస్ట్ చేసిన ఒక రోజు తర్వాత  ఈ పరిణామం చోటు చేసుకుంది. తదుపరి విచారణ కోసం వీరిద్దరినీ రిమాండ్‌కు తరలించారు.

రాజస్థాన్‌లో దోపిడీ, కిడ్నాప్ , హత్యతో సహా అనేక కేసులలో  నిందితురాలు. అనురాధ గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ సింగ్ సహచరి అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సెల్-కౌంటర్ ఇంటెలిజెన్స్) మణిషి చంద్ర తెలిపారు.  రాజస్థాన్‌లోని చురు జిల్లాలో 2017లో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఆనంద్‌పాల్‌ హతమైనాడనీ,  అయితే  పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న అనురాధ కాలా జతేదిని కలిసిందని చెప్పారు. వీరిద్దరు తొమ్మిది నెలలుగా కలిసి ఉంటున్నారన్నారు. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలలో అనేక దోపిడీలు, హత్యలు, ఇతర క్రూరమైన నేరాలలో కాలా జాతేది  మోస్ట్‌ వాంటెడ్‌.  అతని తలపై  రూ. 7 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.

కాగా పోలీసుల సమాచారం ప్రకారం, ఛత్రసల్ స్టేడియం ఘర్షణ, యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌ను అరెస్టు చేసిన కేసులో అతని బంధువు సోను కూడా గాయపడడంతో గ్యాంగ్‌స్టర్ పేరు బయటపడింది. దీంతో సుశీల్‌ కుమార్‌తో జతేదీకి ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు  ఆరా తీస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు