సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర.. జువైనల్‌తో పాటు మరో ఇద్దరికి బాధ్యతలు

7 Oct, 2022 20:28 IST|Sakshi

న్యూఢిల్లీ: మొహాలీలోని పంజాబ్‌ పోలీసు హెడ్‌క్వార్టర్‌పై మే 9న జరిగిన గ్రెనేడ్‌ దాడి ఘటనలో ఓ జువైనల్‌తో సహా ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశారు ఢిల్లీ పోలీసులు. వారిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ను హత్య చేసే పనిని అరెస్టైన జువైనల్‌ (మైనర్‌)కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్‌తో పాటు ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ అరెస్ట్‌ చేసిన మరో వ్యక్తిని అర్షదీప్‌ సింగ్‌గా గుర్తించారు. ఆగస్టు 4న హరియాణాలో ఐఈడీని స్వాధీనం చేసుకున్న కేసులో నిందితుడిగా ఉన్నాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడ్డ నిందితుడు లారెన్స్‌ బిష్ణోయ్‌, జగ్గూ భగ్వాన్‌ పూరియాలు.. సల్మాన్‌ ఖాన్‌ను హత్య చేయాలని మైనర్‌తో పాటు దీపక్‌ సురాక్‌పుర్‌, మోను దగర్‌కు బాధ్యతలు అప్పగించారు. పంజాబ్‌ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పై గ్రెనేడ్‌ దాడిలో అరెస్టయిన జువైనల్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన వ్యక్తి కాగా.. దీపక్‌ హరియాణాలోని సురఖ్‌పుర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

‘మహారాష్ట్ర నాందెడ్‌లో ఏప్రిల్‌ 5న బిల్డర్‌ సంజయ్‌ బియాని హత్య కేసులో జువైనల్‌ నిందితుడు. అలాగే.. గత ఏడాది ఆగస్టు 4న అమృత్‌సర్‌లో గ్యాంగ్‌స్టర్‌ రాణా కండొవాలియా హత్య కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు.. పంజాబ్‌లోని తరణ్‌ తరణ్‌ ప్రాంతానికి చెందిన అర్షదీప్‌ సింగ్‌.. కరుక్షేత్ర ప్రాంతంలో ఐఈడీ రికవరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే.. మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాలో నిందితుడు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జువైనల్‌తో పాటు అర్షదీప్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సల్మాన్‌ ఖాన్‌ను హత్య చేయాలని లారెన్స్‌ బిష్ణోయ్‌, సురఖ్‌పుర్‌, దగర్‌లు తనకు టాస్క్‌ ఇచ్చినట్లు జువైనల్‌ తెలిపాడు. ఆ తర్వాత ఖాన్‌ కన్నా ముందు కొండవాలియాను హత్య చేయాలని సూచించటంతో అతడిని హతమార్చారు. దర్యాప్తులో వెల్లడించిన మరిన్ని కేసులను పరిశీలిస్తున్నాం’ అని పోలీసు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రియుడంటే కియారాకు ఎంత ప్రేమో, వైరల్‌ వీడియో 

మరిన్ని వార్తలు