402 ఎకరాల్లో గంజాయి ధ్వంసం

16 Nov, 2021 04:38 IST|Sakshi
గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న దృశ్యం

విశాఖ జిల్లాలో లిక్విడ్‌ గంజాయి తరలిస్తున్న తల్లీకొడుకుల అరెస్టు 

కాకినాడలో వైద్య విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు వెల్లడి

నిందితులు నరసరావుపేట వాసులు

పాడేరు/ కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా పోలీసుశాఖతో పాటు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో బృందాలు గంజాయి దాడులను కొనసాగిస్తున్నాయి. అలాగే చింతపల్లి మండలం తురబాలగెడ్డ వద్ద లిక్విడ్‌ గంజాయి తరలిస్తున్న తల్లీకొడుకులను సోమవారం అరెస్టు చేశారు. కాగా విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ, జి.కె.వీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలోని 402 ఎకరాల్లో గంజాయి తోటలను  పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జేడీ శంకరరెడ్డి, ఎస్‌ఈబీ అధికారులు సుధాకర్, శ్రీను, ప్రశాంత్, సంతోస్, తదితరులు పాల్గొన్నారు. 

లిక్విడ్‌ గంజాయి పట్టివేత..
విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి నుంచి రూ.లక్ష విలువ చేసే కిలో ద్రవ గంజాయిని ద్విచక్ర వాహనంపై తీసుకొస్తున్నారన్న సమాచారం గొలుగొండ ఎస్‌ఈబీ అధికారులకు అందింది. దీంతో డౌనూరు పంచాయతీ తురబాలగెడ్డ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన తల్లీ, కొడుకులు జరీనా, ఎస్‌కె.జహరుద్దీన్‌ లిక్విడ్‌ గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. వీరు కాకినాడలోని వైద్య విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారినుంచి మొబైల్‌ ఫోన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు