-

సీఎం వీడియో మార్ఫింగ్‌ ట్యాబ్‌పై స్పష్టత ఇవ్వని ఉమా

5 May, 2021 04:11 IST|Sakshi

మూడోసారి సీఐడీ విచారణలోనూ మాజీ మంత్రి ఉమా దాటవేత

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియోను మార్ఫింగ్‌ చేసి ప్రదర్శించిన ట్యాబ్‌ విషయంలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దాటవేత ధోరణినే కొనసాగిస్తున్నారు. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విచారణ సందర్భంగా తన ట్యాబ్‌ పోయిందని ఉమా బదులిచ్చినట్టు తెలిసింది. సీఎం జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్‌ కేసులో ఉమాను ఇప్పటికే రెండు పర్యాయాలు సీఐడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా మూడోసారి 9 గంటలపాటు జరిగిన విచారణలోనూ ఉమా పాతపాటే పాడినట్టు విశ్వసనీయ సమాచారం.

గంటల తరబడి సాగిన ఈ విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. ట్యాబ్‌ పోయిందని ఉమా చెప్పడంతో మీరు నిజం చెబితే సరే.. ట్యాబ్‌పోతే ఎలా కనిపెట్టాలో తమకు తెలుసని సీఐడీ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్యాబ్‌ను గుర్తిస్తామని సీఐడీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ఎవరి నిర్వహణలో ఉందని, సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టింగ్‌లకు ఆదేశాలు ఎవరు ఇస్తారని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.

మార్ఫింగ్‌ వీడియోలు, ఫేక్‌ పోస్టింగ్‌లను సోషల్‌ మీడియాలో ఎలా అనుమతిస్తారని, వాటిని ఎవరు రూపొందిస్తారని ఆరా తీసినట్టు తెలిసింది. సోషల్‌ మీడియా నిర్వహణ, పోస్టింగ్‌లపై ఏమైనా మార్గదర్శకాలున్నాయా? నియమ నిబంధనలు పాటిస్తారా? అంటూ ప్రశ్నించినట్టు తెలిసింది. అనేక ప్రశ్నలకు ఉమా దాటవేత ధోరణే అవలంభించడంతో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో దర్యాప్తును కొనసాగించాలని సీఐడీ నిర్ణయించినట్టు సమాచారం. విచారణ అనంతరం ఉమా మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 7న హైకోర్టులో జరిగే విచారణలో అన్ని విషయాలను నివేదిస్తానని చెప్పారు.  

మరిన్ని వార్తలు