ఏసీబీ కేసులో నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య

9 Nov, 2020 01:20 IST|Sakshi

కీసర భూవివాదంలో పదిరోజుల క్రితమే జైలు నుంచి బయటకు

కుషాయిగూడలోని తన నివాసానికి కిలోమీటర్‌ దూరంలో ఆత్మహత్య

మొన్న నాగరాజు.. నేడు ధర్మారెడ్డి.. ఆత్మహత్యపై అనుమానాలెన్నో

సాక్షి, హైదరాబాద్‌/కుషాయిగూడ: కీసర భూవివాదం కేసులో మాజీ తహసీల్దారు నాగరాజుతో పాటు అరెస్టయిన ధర్మారెడ్డి (77) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికే నాగరాజు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. ధర్మారెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన పది రోజు లకే స్థానిక ఆలయం సమీపంలో వేపచెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడం అనుమానాలకు తావి స్తోంది. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుషాయిగూడ నాగార్జుననగర్‌ కాలనీకి తరలించారు. ఇదే కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి రాగానే రాంపల్లి దయారాలో ధర్మారెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

శనివారం ఇంట్లోంచి వెళ్లి.. ఆదివారం శవమై..
శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ధర్మారెడ్డి ఇంటి నుంచి బయటికెళ్లారు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం తెల్లవారుజామున ఆరున్నర గంటల ప్రాంతంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలోని వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం తెలి సింది. ఏడేళ్లుగా అప్పుడప్పుడు ధర్మారెడ్డి ఆ ఆలయంలో రాత్రిళ్లు నిద్రించేవారని, చివరకు అక్కడే శాశ్వత నిద్రలోకి వెళ్లారంటూ బంధువులు రోదిం చారు. కాగా, బెయిల్‌పై ఇంటికి వచ్చినా ధర్మారెడ్డికి పోలీసుల వేధింపులు ఆగలేదని వారు అంటున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టుకొచ్చి సంతకం చేసి వెళ్లాలని చెప్పారని, ఆరోగ్యం సహకరించట్లేదని బతిమాలినా పోలీసులు వినిపించుకోలేదని వారు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారని, కోర్టుకు వెళ్లలేక, మరోపక్క కొడుకుకు ఇంకా బెయిల్‌ రాకపోవడంతో మానసికంగా కుంగిపోయారన్నారు.

అనుమానాలెన్నో..
77 ఏళ్ల ధర్మారెడ్డి సరిగా నడవలేరు. చీకటిపడితే కళ్లు సరిగా కనిపించవు. అటువంటి వ్యక్తి గుడి సమీపంలో 12 అడుగుల ఎత్తున్న వేపచెట్టు కొమ్మకు తాడు ఎలా కట్టారన్నది అంతుచిక్కట్లేదు. గుడిలోకి చెందిన అడుగున్నర ఎత్తుండే ఓ కుర్చీ ఘటనాస్థలిలో కనిపించింది. ఒకవేళ కుర్చీ ఎక్కి కొమ్మకు దుస్సు ముడివేశారా అంటే.. ఘటనాస్థలాన్ని చూస్తే అలా లేదు. తాడును కొమ్మకు గట్టిగా బిగించి కట్టినట్టుంది. చెట్టెక్కితేనే అది సాధ్యం. వయసు దృష్ట్యా ధర్మారెడ్డి చెట్టెక్కి కొమ్మకు తాడు కట్టడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఘటన స్థలంలో కనిపించిన కుర్చీని వేపచెట్టువైపు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కలేదు. ఈ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదీ వివాదం..
నవాబుల నుంచి వారసత్వంగా సంక్రమించిన 96 ఎకరాలకు ధర్మారెడ్డి తండ్రి నారాయణరెడ్డి 1950 నుంచి 58 మధ్యకాలంలో టెనెంట్‌గా ఉన్నారని ధర్మారెడ్డి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ‘రెండేళ్ల పాటు పన్నులు చెల్లించడంతో 38ఈ సర్టిఫికెట్‌ కూడా వచ్చింది. కిషన్‌సింగ్‌ అనే వ్యక్తి రికార్డులను తారుమారుచేసి కొందరికి ఆ భూమి విక్రయించాడు. దీనిపై విచారణ జరిపిన అప్పటి తహసీల్దార్‌ అందులో 24 ఎకరాలకు ధర్మారెడ్డితో పాటు అతని ముగ్గురి సోదరుల పేరుపై పట్టా పాస్‌బుక్‌ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అయితే, ఆ భూమి తమదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్‌ 25న ధర్మారెడ్డిని, 29న అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులను అన్యాయంగా అరెస్టు చేశార’ని వారు అంటున్నారు. కాగా, ఈ వివాదానికి సంబంధించి అప్పటికే లంచం కేసులో అరెస్టయి ఉన్న మాజీ తహసీల్దార్‌ నాగరాజుపై.. ధర్మారెడ్డి పేరిట అక్రమంగా పట్టా పాస్‌ పుస్తకాలను సృష్టించారనే ఆరోపణలతో ఏసీబీ మరో కేసు నమోదు చేసింది.

ఏ సమయంలో ఏం చేశాడంటే..
– శనివారం సాయంత్రం 4.48 ని.: ధర్మారెడ్డి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చారు. 5.08: వరకు ఉండి వెళ్లిపోయారు. 5.24కి మళ్లీ వచ్చి.. రాత్రి 7.43కి బయటకు వెళ్లారు. 8.06కు మళ్లీ వచ్చి వెంటనే వెళ్లిపోయారు.
– రాత్రి 8.54: ధర్మారెడ్డి ఫోన్‌ మాట్లాడుతూ మళ్లీ ఆలచానికి వచ్చారు.
9.30: టవల్‌ వేసుకొని పడుకున్నారు.
10.11: ఓ బాబుతో ముగ్గురు మహిళలు వచ్చి చాప పర్చుకొని పడుకున్నారు. ఈ అలికిడికి ధర్మారెడ్డి నిద్రలేచి 10.14 సమయంలో గుడిలోనే అటుఇటు తిరిగారు.
– 11.24: ఓ మహిళ నిద్రలేచింది. అటూఇటూ చూసి మళ్లీ పడుకుంది. 
– 11.33: మళ్లీ లేచిన ఆమె అక్కడే ఉన్న కుళాయి నుంచి బాటిల్‌లో నీళ్లు నింపుకుంది. ఆపై తనతో ఉన్న ఇద్దరినీ నిద్రలేపింది. వారంతా ధర్మారెడ్డి కదలికలను గమనించారు.
– 12.10: ముగ్గురు మహిళలు వెళ్లిపోయారు.
– 12.13: ధర్మారెడ్డి చేతిలో టవల్‌తో వెళ్లారు.

సివిల్‌ కేసులో పోలీసుల ప్రమేయమేంటి?
మాకు ఎలాంటి సంబంధం లేని తహసీల్దార్‌ నాగరాజు కేసులో మా నాన్న, అన్నయ్యను పోలీసులు కొందరు పెద్దల ఒత్తిడితో ఇరికించారు. కావాలని సివిల్‌ కేసును క్రిమినల్‌ కేసుగా మార్చారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. 
– ఉమాదేవి, మృతుడి చిన్న కుమార్తె

అంత్యక్రియలకు నా కొడుకును పంపించండి
కొందరి ఫిర్యాదుతో నా భర్తను, కొడుకును అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. సదరు భూమి పత్రాలు ఎక్కడంటూ నా భర్త ధర్మారెడ్డిని ఏసీబీ అధికారులు బెదిరించారు. నా భర్త అంత్యక్రియల కోసం కుమారుడు శ్రీకాంత్‌రెడ్డిని పంపించాలి. అప్పటివరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచుతాం. 
– వెంకటమ్మ, మృతుడి భార్య

మరిన్ని వార్తలు