Dhulipalla Narendra Kumar: ఏసీబీ కస్టడీకి ధూళిపాళ్ల

1 May, 2021 05:43 IST|Sakshi

ధూళిపాళ్లతోపాటు మరో ఇద్దరిని నేడు కస్టడీకి తీసుకోనున్న ఏసీబీ

5 రోజులపాటు విజయవాడ ఏసీబీ కార్యాలయంలో విచారణ

సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల కేసులో ప్రధాన నిందితుడైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌తోపాటు మరో ఇద్దరు నిందితులను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ స్పెషల్‌ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది.

సంగం డెయిరీలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన నరేంద్ర, అతడికి సహకరించిన మరికొందరిపై ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీడీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాబు.ఎ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టం–1988లోని 13(1)(సీ)(డీ), ఐపీసీ సెక్షన్‌ 408, 409, 418, 420, 465, 471, 120బి రెడ్‌ విత్‌ 34 కింద ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ధూళిపాళ్లతోపాటు సంగం డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణన్, జిల్లా కో ఆపరేటివ్‌ రిటైర్డ్‌ అధికారి ఎం.గురునాథం, గతంలో ఎండీగా పనిచేసిన కె.గోపీనాథ్, సంగం డెయిరీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పి.సాంబశివరావు, మరికొందరు నిందితులుగా ఉన్నారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ ప్రాథమికంగా కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. దస్తావేజులు, ఫోర్జరీ పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. పాల ఉత్పత్తిదారుల సొసైటీ ఏర్పాటు దగ్గర్నుంచి దాన్ని ప్రైవేటు కంపెనీగా మార్చుకునే వరకు కోట్ల విలువైన ఆస్తులను కొట్టేసేందుకు పక్కా పథకం ప్రకారమే జరిగినట్టు ఏసీబీ నిగ్గు తేల్చింది. ఈ కేసులో ధూళిపాళ్లతోపాటు పి.గోపాలకృష్ణన్, ఎం.గురునాథంలను ఈ నెల 23న ఏసీబీ అరెస్టు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించడంతో ఈ నెల 24న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందని, రిమాండ్‌లో ఉన్న ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు, బెయిల్‌ ఇవ్వాలని ధూళిపాళ్ల కోర్టును కోరారు. ధూళిపాళ్ల బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ఏసీబీ కస్టడీకి ఇస్తూ అనుమతి ఇచ్చింది. దీంతో మే 1 నుంచి 5వ తేదీ వరకు ధూళిపాళ్లతోపాటు గోపాలకృష్ణ, గురునాథంలను ఏసీబీ విచారించనుంది. శనివారం ఉదయం ఏసీబీ ప్రత్యేక బృందం రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లి ముగ్గురిని కస్టడీలోకి తీసుకోనున్నట్లు ఏసీబీ అధికారి ఒకరు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు